-ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు కొరడా రaలిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపులు కోరుతూ చెల్లించిన మొత్తాలను తిరిగి క్లెయిమ్స్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి. సమగ్రసమాచారాన్ని అధికారులు సేకరించారు. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సవరించిన రిటర్న్స్ దాఖలు చేసి ఆదాయ పన్ను సెక్షన్ 140బీ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో 12 శాతం వడ్డీ, 200 శాతం పన్నును ఫెనాల్టీ రూపంలో వసూలు చేయడంతో పాటు ప్రాసిక్యూట్ చేసి రెండేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉందని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో శుక్రవారం తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్నుశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పన్ను చెల్లింపుదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంద చెల్లింపులను ప్రొత్సహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఆదాయ పన్ను శాఖ ఇన్కం టాక్స్ రిటర్న్స్ ఫారాలను సరళీకృతం చేసి ఆన్‌లైన్‌లో సమర్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పన్ను చెల్లింపుదారులపై నమ్మకంతో రిటర్న్ దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసిన మినహాయింపులు, తగ్గింపులకు ఏ విధమైన ఆధారాలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సిన అవసరం లేకుండా చూశామన్నారు. ఐటీ రిటర్న్ దారులకు రావాల్సిన రిఫండ్స్‌ను బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో రిటర్న్స్ దాఖలు చేసిన క్లెయిమ్స్ ను నిశితంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు మినహాయింపులు వర్తించనప్పటికీ రిఫండ్ కోరుతూ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించామన్నారు. ఇలాంటి వారిలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, పేరొందిన ఐటీ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించామని మధుస్మిత తెలిపారు. తెలుగు రాష్టేతర ఐటీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎపీ, తెలంగాణలో పానకార్డులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరు యాజమన్యాలు జీతం చెల్లింపుల్లో తగ్గించిన పన్నుల్లో 75 శాతం నుంచి 90 శాతం వరకు రిఫండ్ క్లెయిమ్ చేసినట్లు గుర్తించామన్నారు. కొంతమంది కమీషన్లకు ఆశపడిన మధ్యవర్తుల ప్రోద్భలంతో కూడా ఈ విధంగా చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ తరహా సలహాలు ఇచ్చిన కొందరు మధ్యవర్తులను గుర్తించామని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో తప్పుడు క్లెయిములు చేసిన వారి వివరాలను కూడా సేకరించామన్నారు. కొందరు అధికారుల ఆదేశాల మేరకు సవరణ రిటర్న్ దాఖలు చేశారని చెప్పారు. మిగిలిన వారు కూడా డిసెంబర్ 31లోగా ఏ విధమైన అపరాధ రుసుము లేకుండా పన్ను చెల్లించొచ్చని మిథాలి తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు వారు 139 (5) సెక్షన్ కింద సవరణ రిటర్న్స్ దాఖలు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి ఆదాయ పన్నుశాఖ కార్యాలయాల్లోని ఆయకర్ సేవా కేంద్రాల్లో ఉద్యోగుల సహకారం కూడా తీసుకోచ్చని మిథాలి మధుస్మిత స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశాల్లో ఆయా ప్రధాన పట్టణాల్లోని ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News