మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పాము కాటుకు గురై ఎవరూ చనిపోకుండా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వైద్య ఆరోగ్యం, జగనన్న సురక్ష, స్పందన జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాముకాటుకు గురై ఎవరు కూడా చనిపోరాదని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో పాముకాటు మందు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి పాముకాటుకు గురైన వ్యక్తికి సకాలంలో సరైన వైద్యం చేసి ఆదుకోవాలని సూచించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులు ఫ్యామిలీ ఫిజీషియన్ల వద్ద పాముకాటు విరుగుడు (యాంటీ వీనం) మందు అందుబాటులో సిద్ధంగా ఉంచామన్నారు. పాముకాటుకు గురైన వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తక్షణమే అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. వారికి చికిత్స చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అన్ని విధాల శిక్షణ ఇచ్చామన్నారు. పాముకాటుకు గురైన వ్యక్తులు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం అన్ని విధాల వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అవనిగడ్డ తదితర సముద్రతీర ప్రాంతాలు మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా పాము కాటు విరుగుడు మందును అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ గీతా బాయి తదితర అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News