Breaking News

“అమ్మ” ప్రోత్సాహం

-భవిష్యత్తుకు బాసట…
-“అమ్మ” ఆప్యాయత, అనురాగం, ప్రేమ స్ఫూర్తిదాయకం
-“అమ్మ” ఆదరణతో ఉన్నత స్థాయికి ఎదగండి
-మానసిక ప్రశాంతతకు హార్మోన్ల సమతుల్యత అవసరం
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ భారతదేశంలో రవాణా రంగానికి ఎంతో కీలకమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిన విజయవాడ నగరంలో “అమ్మ” విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైనదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు.
ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మ కళ్యాణమండపంలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డిల్లీరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి ఉన్నత విద్య అందుకునేందుకు ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుటుందన్నారు. దాతల భాగస్వామ్యం తోడైతే విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయగలుగుతామన్నారు. విద్యలో ప్రతిభ ఉన్నప్పటికీ పేదరికం కారణంగా ఎంతో మంది తల్లి దండ్రులు వారి పిల్లల చదువులను మధ్యలోనే అపేస్తున్న కారణంగా ఉన్నత చదువులు చదవాలనే కోరిక నెరవేర్చుకోలేక పేదలుగానే మిగిలిపోతున్నారని అన్నారు. సహజంగా ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు పేద కుటుంబాలకు చెందిన వారై ఉంటారన్నారు. వారి పిల్లలకు మంచి విద్యా బోధన అందించేందుకు ఆర్థిక చేయూతను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుంటుంబాల వారిని అమ్మ లా ఆదరించడం అభినందనీయమన్నారు. గత 24 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా విద్యార్థులకు ఉపకారవేతనాలను అందించడం మరి కొంతమంది దాతలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది 314 మంది విద్యార్థులకు 14.50 లక్షల రూపాయల ఉపకార వేతనాలు, నోట్ పుస్తకాలను పంపిణీ చేయడంతోపాటు రెండు ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలందించడం గొప్ప విషయమన్నారు. మొగల్రాజుపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ పాఠశాలలను దత్తత తీసుకుని ముగ్గురు కంప్యూటర్ టీచర్లకు జీతాలను చెల్లించడంతోపాటు పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ద్వారా నగరంలోనే ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ఈ పాఠశాలలో ప్రవేశం పొందడం కోసం విద్యార్థులు ఉత్సాహపడే స్థాయికి పాఠశాల అభివృద్ధి చెందాలని కోరారు. దాతలు అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యారంగంలో రాణించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. పిల్లలు ఆసక్తిగా విద్యను అభ్యసించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సహజంగా విద్యార్థి దశలో ఒత్తిడి ఎదుర్కొనే విద్యార్థులు వారి శరీరంలో ఉండే హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవాలన్నారు. అటువంటి వ్యవస్థ మన శరీరంలోనే ఉంటుందన్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం ద్వారా విద్య పట్ల ఆసక్తిని పెంచుకోవచ్చన్నారు. ప్రతి విద్యార్థి తమ మనసులో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే అంశాలను మాత్రమే గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కేవలం మనసులో కలిగే భావనలను ఆస్వాదించడం ద్వారా హార్మోన్లు చాలా చక్కగా పనిచేస్తాయని ఏకాగ్రత, పట్టుదల తో ఆశించి లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సూచించారు.
ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆటోనగర్ గవర్నపేటలో ఆటోమొబైల్ షాపులలో పనిచేసే సిబ్బంది, కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు 1999వ సంవత్సరం నుండి ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా ఆర్థిక సహయాన్ని నోట్ పుస్తకాలను అందించడం జరిగిందన్నారు. కానూరులో 60 లక్షల రూపాయలతో వృద్ధాశ్రమాన్ని నిర్మించి 40 మంది వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భాధితులకు సహాయ సహకారం అందిస్తున్నామని కరోనా సమయంలో సైతం రోగులకు ప్రతి రోజు ఉచితంగా భోజన ఏర్పాట్లు కల్పించామన్నారు. బోయపాటి శివరామకృష్ణయ్య పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి ఏడాది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎంతో అట్టడుగు స్థాయి నుంచి ఐఏఎస్ వరకు ఎదిగిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు జీవితం విద్యార్థులు స్ఫూర్తిదాయకంగాతీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సుంకర చంద్రశేఖర్, గారపాటి సతీష్ బాబు దోనేపూడి దుర్గాప్రసాద్, యార్లగడ్డ సుబ్బారావు, అన్నే శ్రీనివాసరావు, బొబ్బా నారాయణ రావు మిరియాల వేంకటేశ్వర రావు అసోసియేషన్ సభ్యులు, సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *