కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు మండలం మద్దూరు జడ్పి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పరిశీలించారు. ఆదివారం పునరావాస కేంద్రంలోని ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో ప్రజలను ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని, ఏర్పాట్లు బాగున్నాయని అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మద్దూరులంకలో గోదావరి ఉదృతి, ఏటిగట్లను తానేటి వనిత పరిశీలించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు సంతృప్తినిచ్చాయని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పల్లిపాలెం నుంచి దాదాపు 40 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. 400 మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసరాలను ఇప్పటికే అందుబాటులోకి ఉంచామని తెలిపారు. 6 వేల కేజీల బ్యియం, 400 కేజీల కందిపప్పు, 400 లీటర్ల పామాయిల్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు అత్యవసర కేంద్రాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. అధికారులు వరద ముంపు తగ్గి పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని వివరించారు. అయినప్పటికీ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకూ ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని, అధికారులు అప్రమత్తతతో ఉండాలని ఆమె సూచించారు. కొవ్వూరు ఆర్డీవో మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News