విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలనలో లోపాలను ఎత్తిచూపడంతో జర్నలిస్టుల పని అయిపోయినట్లు కాదని సి.ఆర్. మీడియా అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జర్నలిస్టులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్మాణాత్మక విమర్శవల్ల ప్రభుత్వంతో పాటు ప్రజలకు ప్రయోజనకరంగా వుంటుందన్నారు. ఇందువల్ల జర్నలిస్టుల ప్రతిష్ట పెరుగుతుందని ఆయన అన్నారు. నిష్పక్షపాతంగా, నిజాలు రాయడంవల్ల కొంత యిబ్బంది వుంటేవుండవచ్చని, కాని ఆత్మ సంతృప్తి వుంటుందన్నారు. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటును ప్రముఖంగా చూపి మొత్తం వ్యవస్థనే చెడ్డదిగా రాయడం, ఆరోపణలు చేయడం సరైనది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మీడియాఅకాడమి ఆధ్వర్యంలో యేర్పాటు చేసిన ఆన్ లైన్ అవగాహన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో 50 వేల సంస్థలు యేర్పాటయ్యాయని ఆ శాఖ డైరక్టర్, ఐ.ఎ. ఎస్. అధికారి శ్రీ లక్ష్మీశా తెలిపారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాలను, సేవలను ప్రజల ముంగిట అందిస్తుందని గుర్తు చేశారు. ఒకే అంశానికి సంబంధిచి కొన్ని పత్రికలు, ఛానెళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో విరుద్ధమైన వార్తలు ఇస్తున్న సంగతి విస్మయానికి గురిచేస్తుందని ఆయన సోదాహరణంగా వివరించారు. అంతే కాకుండా, ప్రభుత్వాలను బట్టి కూడా విధానపర నిర్ణయాలను వక్రీకరించడం ఎలాంటి జర్నలిజమో ఆలోచించాలని ఆయనకోరారు.
జర్నలిస్టులు సమాజానికి అవసరమైన అంశాలపై రచనలు చేయాలని సూచించారు. ఇలా పాత్రికేయులు చేసిన రచనల్ని గ్రంధాలయ సంస్థ కొనుగోలు చేసేలా కోరామని, అందుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఉత్తరువులు సైతం యిచ్చిందన్నారు. అదేవిధంగా జర్నలిస్ట్ హెల్త్ కార్డు వినియోగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్య శ్రీ ట్రస్టు హెల్ప్ లైన్ 104 లో ప్రత్యక లైను యేర్పాటు చేయనుందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి
చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీ మోహన రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులను ఆయన సన్మానించారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఛైర్మన్ కొమ్మినేనిని ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News