గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతోనే గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. స్వచ్చ వాయు సర్వేక్షణ్ లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ కు భోపాల్ లో అవార్డ్ తీసుకున్న సందర్భంగా సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ను అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాధిపతులు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చ వాయు సర్వేక్షణ్ లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ వచ్చిందని, దక్షిణ భారతదేశంలో ఒక్క గుంటూరు నగరానికే అవార్డ్ రావడం ఎంతో గర్వకారణమన్నారు. అవార్డ్ రావడంలో నగర ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారం, అధికారులు, సిబ్బంది కృషి కీలకమన్నారు. స్వచ్చ వాయు సర్వేక్షణ్ లో భాగంగా వార్డ్ సచివాలయాల వారిగా మొక్కల పెంపకం పై కార్యదర్శులకు కార్యాచరణ ప్రణాళిక కేటాయించామన్నారు. పారిశుధ్య విభాగంలో ఇంటింటి చెత్త సేకరణకు ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చామని, దివైడర్లు, సెంట్రల్ మీడియన్స్ లో మొక్కల పెంపకం పెంచామన్నారు. కాలనీల్లో స్థానికంగా పార్క్ లను ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా అభివృద్ధి చేశామని తెలిపారు. త్వరలో నగరంలో స్థానికంగా ఉన్న నగరపాలక సంస్థ స్థలాల్లో కూడా మొక్కల పెంపకం, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పెద్ది రోజా, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, మేనేజర్ శివన్నారాయణ, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News