విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 31 వ డివిజన్ ముత్యాలంపాడులో శుక్రవారం జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గతంలో రేషన్ కార్డు పొందాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని.. ప్రతి 6 నెలలకోసారి కొత్త కార్డులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 78,215 తెల్ల రేషన్ కార్డుదారులు ఉండగా.. గడిచిన నాలుగేళ్లలో 8,258 మందికి కొత్తగా కార్డులు జారీ చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ ఒక్క ఏడాదిలోనే 1,146 నూతన కార్డులు మంజూరు చేయగా.. డివిజన్ లో 41 కొత్త కార్డులు ఉన్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీరంతా కార్డులను సద్వినియోగపరచుకుని పిల్లల చదువులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు. అలాగే ఈ కుటుంబాలకు ప్రతినెలా క్రమంతప్పకుండా 52 రేషన్ వాహనాల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. కోవిద్ కష్టకాలంలోనూ సెంట్రల్లోని కార్డుదారులకు ప్రతినెలా 616.5 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిందని మల్లాది విష్ణు గుర్తుచేశారు. ఇంటి వద్దకు సరుకులు సరఫరా చేయడమే కాకుండా.. 6 నెలల పాటు కందిపప్పు, శనగలను ప్రతినెలా ఉచితంగా జగనన్న ప్రభుత్వం అందించిందన్నారు. రాష్ట్రంలో బీపీఎల్ కు దిగువున కోటి 54 లక్షల కుటుంబాలు ఉంటే.. 89 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం బియ్యం కేటాయిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 56 లక్షల కార్డుదారులకు బియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదనే ఆలోచనతో ప్రతి ఏడాది రూ. 3వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఖర్చు చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నూతన కార్డులను పంపిణీ చేశారు.
Prajavartha Online Telugu News