-నిబంధనలు పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం..
-షాపుకు షాపుకు మధ్య ఫైర్ ఇంజన్ వెళ్లేలా దూరం పాటించాలి..
-” షాపుల వద్ద నో స్మోకింగ్ ” బోర్డులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి..
-జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి పండుగ సందర్భంగా షాపుల నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం జేసీ ఛాంబర్ లో దీపావళి పండుగ ముందస్తు ఏర్పాట్ల పై డీఆర్వో జి.నరశింహులు, కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు, సమన్వయ శాఖల అధికారులతో జేసీ తేజ్ భరత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ సమీక్షిస్తూ నవంబరు 12 వ తేదీన జరుపుకునే దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే షాపులకు అగ్ని ప్రమాద నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పెద్ద మొత్తంలో దీపావళి దుకాణాలు ఏర్పాటు చేసే చోట షాపు షాపు కి మధ్య నుంచి ఫైర్ వాహనం వెళ్లేలా దూరం పాటించాలన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా షాపుకు అనుమతి ఇవ్వాలన్నారు. ఇందుకోసం ఆర్డీవో కార్యాలయంలో, మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమన్వయ శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. షాపుల నిర్వహణ, అమ్మకపు పన్ను వసూళ్లు, జీ ఎస్ టి , తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు ప్రభుత్వంచే జారీ చేసిన మార్గదర్శకాలు అమలులో ఖచ్చితత్వం పాటించాలని జేసీ తేజ్ భరత్ అన్నారు. నియమాలను పాటించని వారి విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు అధికారులు, ఫైర్ అధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేసి నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సామూహికంగా షాప్స్ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 50 షాపులు మించి ఉండకుండా తగిన విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కువ మొత్తంలో మందుగుండు సామాగ్రి నిలవ ఉంచే గోదాముల సముదాయాలు వద్ద ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం కలుగకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆయా ప్రాంతాల్లో భద్రత విషయంలో నివేదిక అందచేయాలని, ఈ ప్రక్రియను సంబందించిన రెవెన్యూ డివిజన్ అధికారి ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఇండ్ల మద్యలో మందుగుండు సామగ్రి నిలవ లేకుండా చూడాలన్నారు. తక్కువ శబ్దం వొచ్చే క్రేకర్స్ అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు. ప్రతి షాపుకి మధ్య 3 మీటర్ల కనీస దూరం పాటించాలని,
తాత్కాలికంగా ఏర్పాటు చేసే షాపుల ప్రదేశాల్లో అధికారులు జాయింట్ తనిఖీలు చేపట్టాలని, మండల స్థాయి లో దీపావళి సామగ్రి తయారు చేసే, అమ్మే యూనిట్స్ జాయింట్ తనిఖీలు చేపట్టాలి డివిజన్ స్థాయి లో ఆర్డీవో, డి ఎస్ పి, డివిజన్ ఫైర్ ఆఫీసర్, డివిజన్ డెవలప్మెంట్ అధికారి,మండల స్థాయి లో తహశీల్దార్, ఎంపీడీఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, అగ్ని మాపక అధికారి, ఫైర్ బకెట్స్, ఇసుక, అగ్ని నివారణ పరికరాలు, నీరు వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో “నో స్మోకింగ్ జోన్ ” ఖచ్చితంగా పాటించాలా చర్యలు చేపట్టాలన్నారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలు తప్పని సరిగా పాటించాలని, లైసెన్స్ మంజూరు చేసే షాపులకు నో అబ్జెక్షన్ ద్రువపత్రలు తప్పనిసరని తేజ్ భరత్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో జి. నరశింహులు, కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి, సి.హెచ్. ఎం.ఎల్.కింగ్, కొవ్వూరు మున్సిపల్ కమిషనర్, బి. శ్రీకాంత్, పోలీస్, పంచాయతీ, మత్స్య శాఖ, దేవాదాయ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News