Breaking News

ఓటరు దరఖాస్తుల పరిష్కారం, ఆన్‌లైన్‌ నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టండి

-పారదర్శకంగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి
-సంక్షిప్త సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
-కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌)-2024లో భాగంగా 2024, జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్న నేపథ్యంలో దరఖాస్తుల పరిష్కారం, ఆన్‌లైన్లో డేటా నమోదు అత్యంత కచ్చితంగా ఉండేలా చూడాలని.. ఏ దశలోనైనా నిర్లక్ష్యం చూపితే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు హెచ్చరించారు.
ఎస్‌ఎస్‌ఆర్‌-2024తో పాటు రానున్న సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (డీఈఎంపీ) రూపకల్పనపై కలెక్టర్‌ డిల్లీరావు.. జాయింట్‌ కలెక్టర్‌ డా. ఎస్‌.సంపత్‌ కుమార్‌తో కలిసి ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, రెవెన్యూ, ఎన్నికల అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ అత్యంత స్వచ్ఛంగా, దోష రహితంగా తుది ఓటర్ల జాబితా ఉండాలని.. ఇందుకు అధికారులు కృషిచేయాలన్నారు. చిన్నచిన్న పొరపాట్లకు కూడా తావులేకుండా చూడాలని.. నిబద్ధతతతో, చిత్తశుద్ధితో ఓటర్ల జాబితా రూపకల్పనలో కీలక భాగస్వాములు కావాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. రీవెరిఫికేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని.. మరణించిన వారి ఓట్ల తొలగింపు విషయంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. రానున్న సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన ప్రణాళికతో సన్నద్ధత కార్యకలాపాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో, సజావుగా ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (డీఈఎంపీ)లో పొందుపరచాల్సిన ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో కసరత్తు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు, రిసెప్షన్‌ సెంటర్లు, స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ సెంటర్లకు అవసరమైన ప్రాంతాలను, భవనాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి జిల్లా, నియోజకవర్గ స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలన్నారు. అదే విధంగా రూట్ల వారీగా ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని తరలించేందుకు అవసరమైన వాహనాలపైనా ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు.
సమావేశంలో విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌, డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వరరావు, నందిగామ ఆర్‌డీవో పి.సాయిబాబా, తిరువూరు ఆర్‌డీవో కె.మాధవి, కలెక్టరేట్‌ ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *