గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల సమస్యల పై అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివజ్యోతి డిప్యూటీ కమిషనర్లను, విభాగాధిపతులను ఆదేశించారు. కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల ఉద్యోగులకు సంబందించిన సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3 వ సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రీవెన్స్ లో ఆయా విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొంటారని, నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు, మినిస్టీరియల్ సిబ్బంది, ఆయా విభాగ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఎదురవుతున్న, సర్వీస్ కి సంబందించిన సమస్యల పై అర్జీలు అందించవచ్చని తెలిపారు. ఉద్యోగులు తమ సమస్యల పై అందించే అర్జీలను ప్రత్యేకంగా రిజిస్టర్ లో నమోదు చేయాలని, తదుపరి గ్రీవెన్స్ నాటికి ప్రస్తుతం అందిన అర్జీల పరిష్కార వివరాల రిపోర్ట్ తో హాజరు కావాలని మేనేజర్ ని ఆదేశించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, మేనేజర్ శివన్నారాయణ, వివిధ విభాగాల సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News