-పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
-రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు
-ఏపీకి కేంద్ర బృందాలను పంపాలి: ఏఐకెఎస్ అధ్యక్షులు రావుల వెంకయ్య
-సీపీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 30 గంటల నిరసన దీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో కరువు విలయతాండం చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు సహాయ చర్యలు చేపట్టాలని సీపీఐ, ఇతర రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరువుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వలసల నివారణకు చర్యలు చేపట్టాలని, అలాగే కృష్ణాజలాల పున:పంపిణీకై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీలలో 30 గంటల నిరసన దీక్ష చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సోమవారం ఈ దీక్షను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంటలను పరిశీలన, రైతాంగం, కరువు గురించి మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. కరువు పరిస్థితుల తీవ్రంగా ఉన్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నోరెత్తటం లేదన్నారు. రాష్ట్రంలో 18 జిల్లాలో 440 పైచిలుకు మండలాల్లో కరువు సంభవించిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కరువు ప్రాంతాలను పరిశీలించి కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని కామన్‌కోడ్ అమలు చేయాలన్నారు. ప్రతి ఎకరానికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పనులు లేక వలసలు పోతున్న ప్రజానీకం కోసం తక్షణం గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించి పనులు కల్పించాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రతిపాదిన త్రాగునీటి సౌకర్యాలకు తగు చర్యలు చేపట్టాలన్నారు. కరువు కారణంగా పశువులకు ఆహారం లభించటం లేదన్నారు. పశుగ్రాసాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించాలన్నారు. ఎక్కడైనా బోర్లు, బావుల్లో నీరు ఉంటే అక్కడ 24 గంటలు కరెంటు సరఫరా చేయాలన్నారు. విద్యుత్ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కర్నాటక ఎన్నికలో లబ్దిపొందేందుకు ఎగువ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు కేటాయించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో లబ్దిపొందటం కోసం కృష్ణా జాలల పున:పంపిణీ అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ఇప్పటికే సాగునీరు రాక పంటలు వేసుకోలేని పరిస్థితి ఉంటే కాస్తోకూస్తో వచ్చే కృష్ణా నీటిని కూడా రాకుండా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కృష్ణా జలాల పున:పంపిణీ కోసం కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ చేపట్టిన ఉద్యమానికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని కోరారు.
కేంద్రం పరిశీలకులను పంపించాలి: రావుల వెంకయ్య
ఆంధ్రప్రదేశ్‌లో కనీవిని ఎరుగని రీతిలో ఈ ఏడాది కరువు వచ్చిందన్నారు. సహజంగా కరువు ఉండే రాయలసీమతో పాటు కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు కూడా కరువుబారిన పడ్డాయన్నారు. రాష్ట్రాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా కేంద్ర బృందాలను పంపించే మోదీ ప్రభుత్వానికి ఏపీలో కరువు కనపించటం లేదా? అని నిలదీశారు. ప్రధాని మోదీ కేంద్ర బృందాలను ఏపీకి పంపించి కరువు పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి మేలు జరిగేందుకు ఈ వేదిక నుంచే సమర శంఖారావాన్ని పూరించాలని సూచించారు.
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: గిడుగు రుద్రరాజు
రెండు నెలలుగా రాష్ట్రంలో కరువు తీవ్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రి స్పందించటం లేదన్నారు. వేరుశనగ రైతు ఎకరాకు రూ.45 వేల పెట్టుబడి పెడితే పంట చేతికిరాక పూర్తిగా నష్టపోవటం జరిగిందన్నారు. పల్నాడు జిల్లా వెలుర్తి మండలంలో దళిత రైతు అప్పుల బాధ పడలేక ఆత్మహత్య చేసుకోవటం జరిగిందన్నారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో 50 వేల ఎకరాల్లో పంటలు వేస్తే ప్రభుత్వ రికార్డుల్లో కేవలం 10 వేల ఎకరాలు మాత్రమే చూపిస్తున్నారని చెప్పారు. వలసల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ చేసే పోరటాల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని స్పష్టం చేశారు. సీపీఐ నిరసన దీక్షలో పాల్గొని సంఫీుభావం ప్రకటించారు.
ఈ దీక్షల ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నీటి యాజమాన్య అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 122 ఏళ్ల నాటి కరువు పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు ద్వారా తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను గుర్తించిన మొదటి రాజకీయ పార్టీ సీపీఐ అన్నారు.
ఏపీపై కేంద్రం కుట్ర: ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం
కృష్ణా జలాల పున:పంపిణీ కోసం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఆలోచన చేయటం లేదన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయటానికి కేంద్రం చర్యలు తీసుకోవటం లేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సీపీఐ చేపట్టిన 30 గంటల నిరసన దీక్షలో తాము పాల్గొని మద్దతు తెలుపుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, నాయకులు నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, గుజ్జుల ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, పి హరనాథరెడ్డి, డి.జగదీష్, పి.రామచంద్రయ్య, జంగాల అజయ్‌కుమార్, డేగా ప్రభాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.కోటేశ్వరరావు, ఆవుల శేఖర్, ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ విమల, పెన్మెత్స దుర్గాభవాని, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్‌బాబుÑ ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి జానన్స్‌బాబు, కె శివారెడ్డిÑ ఏఐపీఎస్‌ఓ రాష్ట్ర కన్వీనర్ మహంకాళి సుబ్బారావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాల సిపిఐ కార్యదర్శులు సి జాఫర్, ఎం వేమయ్య, ఒమ్మి రమణ, ఎం కృష్ణచైతన్య, ఎ మారుతీ వరప్రసాద్‌లతోపాటు 26 జిల్లాలకు చెందిన సీపీఐ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీ ప్రజానాట్య మండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రనాయక్, చిన్నం పెంచలయ్య బృందం అభ్యుదయ గీతాలు ఆలపించారు. ఎండిపోయిన మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, మిర్చి తదితర పంటలను దీక్షా శిబిరంలో ప్రదర్శించారు.
Prajavartha Online Telugu News