– అత్యంత అప్రమత్తంగా, నిబద్ధతతో ప్రత్యేక సంక్షిప్త సవరణ
– డిసెంబర్ 2, 3 తేదీల్లో 1,781 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలు
– అర్హులైనవారు కొత్తగా ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి
– డిసెంబర్ 26 నాటికి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించి జనవరి 5న తుది జాబితా ప్రచురణ
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షలో ఓటుహక్కు నమోదు, వినియోగం అత్యంత కీలకమని.. వివాద రహిత ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ఆరోగ్యంగా ఉండటం ప్రధానమని.. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా అప్రమత్తత, నిబద్ధతతో ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్)-2024 చేపడుతున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
విజయవాడ పటమటలో కోనేరు బసవయ్య చౌదరి బాలుర ఉన్నతపాఠశాలలో పది పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఏర్పాటుచేసిన ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాన్ని కలెక్టర్ డిల్లీరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటు నమోదుకోసం వచ్చిన యువ ఓటర్లతో మాట్లాడారు. ప్రజలు శిబిరాలను సద్వినియోగం చేసుకునేలా చూసేందుకు, దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి బీఎల్‌వోలకు కలెక్టర్ మార్గనిర్దేశనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్-2024లో భాగంగా శని, ఆదివారాల్లో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని 1,781 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని.. ఈ శిబిరాల్లో బీఎల్‌వోలు వివిధ ఫారాలతో అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. కొత్తగా ఓటు నమోదుకు ఇది మంచి అవకాశమని.. డాక్యుమెంట్లను సమర్పించిన వెంటనే వివరాలను బీఎల్‌వో యాప్‌లో నమోదు చేయడం జరుగుతుందని.. ఆ వెంటనే తనిఖీ చేసి పరిష్కరించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, పనులపై వెళ్లేవారిని దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం సమయాల్లో కూడా వారికి అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు వెల్లడిరచారు. డిసెంబర్ 9 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి 26వ తేదీలోగా వాటిని పరిష్కరించి జనవరి 5న తుది జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడిరచారు. ఆ తర్వాత కూడా ఇంకా ఎవరైనా ఓటు నమోదు చేసుకోకుండా మిగిలిపోతే నిరంతర అప్‌డేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ల గడువు వరకు నమోదుకు అవకాశముంటుందని.. ఇందుకు సంబంధించి ఈసీఐ, సీఈవో నుంచి వచ్చే సవివర మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
18-19 వయసువారిపై ప్రత్యేక దృష్టి:
ఓటర్లలో 18-19 వయసున్నవారు దాదాపు 3.5 శాతం మేర ఉండేందుకు అవకాశముంటుందని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వెల్లడిరచారు. ఈ కేటగిరీకి సంబంధించి ఇప్పటికే దాదాపు 20 వేల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని.. నిర్దేశించుకున్న 30 వేల లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చదువుకునేందుక వేర్వేరు ప్రాంతాలకు యువత వెళ్లడం వల్ల విద్యాసంస్థల సహకారం కూడా తీసుకుంటున్నట్లు వెల్లడిరచారు. జిల్లా మొత్తంమీద చూస్తే ఎలక్టోరల్ పాపులేషన్ (ఈపీ) రేషియో 688గా ఉందని.. ఇది ఆరోగ్యకరమైన నిష్పత్తేనని పేర్కొన్నారు. ఒక్క విజయవాడ పశ్చిమలో మాత్రం 654గా ఉందని.. అందువల్ల నియోజవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు వెల్లడిరచారు. దాదాపు 12,800 ఫొటో, డెమోగ్రఫిక్ సిమిలారిటీస్‌తో పాటు డెత్, పర్మినెంట్ మైగ్రేషన్, జీరో డోర్ నంబర్లు, ఒకే డోర్ నెంబరుపై పదికి మించిన ఓట్లు తదితరాలను అత్యంత పారదర్శకతతో, జవాబుదారీతనంతో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధానం ద్వారా సరిచేస్తున్నట్లు వివరించారు. గుర్తింపు పొందిన రాజీకీయ పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. మరణించిన ఓటర్ల తొలగింపునకు సంబంధించి కచ్చితంగా నిబంధనలను అనుసరిస్తున్నట్లు వెల్లడిరచారు. వారంవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని.. అదే విధంగా సీఈవో ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు.. క్షేత్రస్థాయి బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ తుది జాబితా రూపకల్పనకు కృషిచేస్తున్నట్లు వెల్లడిరచారు. ఈ మొత్తం ప్రక్రియలో మీడియా కూడా కీలక భాగస్వామ్యం అందించాలని కోరారు. జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను, ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు. కలెక్టర్ వెంట ఏఈఆర్‌వో ఎం.వెంకటరామయ్య, డిప్యూటీ తహసీల్దార్ కె.రవీంద్ర తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News