Breaking News

విభిన్న ప్ర‌తిభావంతుల సాధికార‌త‌కు ప్ర‌భుత్వ కృషి

-ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
-ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్ర‌తిభావంతులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెంది సాధికార‌త సాధించే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క్షేత్ర‌య్య క‌ళాక్షేత్రంలో ఎన్‌టీఆర్‌, కృష్ణా జిల్లాల విభిన్న ప్ర‌తిభావంతులు, టీజీ, వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో ఆదివారం అంత‌ర్జాతీయ విభిన్న ప్ర‌తిభావంతుల దినోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి. జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ శాస‌న‌స‌భ్యులు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మ‌న్ మ‌ల్లాది విష్ణువ‌ర్ధ‌న్‌, విభిన్న ప్ర‌తిభావంతుల శాఖ డైరెక్ట‌ర్ బి.ర‌విప్ర‌కాష్ రెడ్డి.. విభిన్న‌ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రుల‌తో క‌లిసి జ్యోతిప్ర‌జ్వ‌ల‌న చేసి వేడుక‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ అంత‌ర్జాతీయ విభిన్న ప్ర‌తిభావంతుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలో విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమానికి విశేష కృషి జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. 1995 దివ్యాంగుల చ‌ట్టాన్ని స‌వ‌రిస్తూ 2016లో దివ్యాంగుల హ‌క్కుల కొత్త చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేసి ఈ ఏడాది కొత్త‌గా మార్గ‌ద‌ర్శ‌కాలు, నిబంధ‌న‌లు విడుద‌ల చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ చ‌ట్టం మేర‌కు జిల్లాస్థాయిలో క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న విభిన్న‌ప‌తిభావంతుల సంక్షేమం, అర్జీల ప‌రిష్కారానికి ఒక కొత్త క‌మిటీ ఏర్పాటైంద‌ని.. ఈ క‌మిటీ ద్వారా విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమానికి కృషిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా ప్ర‌తి కార్యాల‌యంలో విభిన్న ప్ర‌తిభావంతుల గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ కోసం అధికారిని నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. విభిన్న ప్ర‌తిభావంతుల‌ను ఎవ‌రైనా త‌క్కువ‌గా చూసినా, వివక్ష చూపినా చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో 2022-23లో దాదాపు రూ. 31 ల‌క్ష‌లు విలువ‌చేసే, 2023-24లో రూ. 1.78 కోట్ల విలువ‌చేసే మూడు చ‌క్రాల సైకిళ్లు, వీలుఛైర్లు, శ్ర‌వ‌ణ యంత్రాలు, ల్యాప్‌టాప్‌, ట‌చ్‌ఫోన్లు, బ్యాట‌రీతో న‌డిచే మోటారు వాహ‌నాలు, మూడు చ‌క్రాల మోటారు వాహ‌నాలు త‌దిత‌రాల‌ను అందించిన‌ట్లు వివ‌రించారు. స్టీఫెన్ హాకింగ్‌, సుధాచంద్ర‌న్ వంటివారు వైక‌ల్యాన్ని అధిగ‌మించి సాధించిన విజ‌యాలు అపూర‌ప‌మైన‌వ‌ని.. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని విభిన్న ప్ర‌తిభావంతులు ప్ర‌భుత్వ ప్రోత్సాహాన్ని స‌ద్వినియోగం చేసుకొని ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని సూచించారు. విభిన్న ప్ర‌తిభావంతుల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న ప్ర‌భుత్వ‌, స్వ‌చ్ఛంద సంస్థ‌లకు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. విభిన్న ప్ర‌తిభావంతులు బాగా ఎదిగేలా ప్రోత్స‌హిస్తున్న వారి త‌ల్లిదండ్రుల‌కు కూడా న‌మ‌స్కారాలు తెలియ‌జేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు పేర్కొన్నారు.

దేశంలో ఎక్క‌డాలేని విధంగా విభిన్న ప్ర‌తిభావంతుల‌కు సామాజిక భ‌ద్ర‌త: శాస‌న‌స‌భ్యులు మ‌ల్లాది విష్ణువ‌ర్ధ‌న్‌
విజ‌య‌వాడ సెంట్ర‌ల్ శాస‌న‌స‌భ్యులు మ‌ల్లాది విష్ణువ‌ర్ధ‌న్ మాట్లాడుతూ విభిన్న ప్ర‌తిభావంతుల‌ను వివిధ ప్ర‌భుత్వ‌, స్వ‌చ్ఛంద సంస్థ‌లు క‌న్న‌పిల్ల‌ల్లా చూస్తున్నాయ‌ని పేర్కొన్నారు. నాలుగున్న‌రేళ్లుగా గౌర‌వ ముఖ్య‌మంత్రి నేతృత్వంలో ప్ర‌భుత్వం రాష్ట్రంలో విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమానికి విశేష కృషిచేస్తోంద‌ని.. సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించేందుకు వివిధ ప‌థ‌కాలు అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. దేశంలో ఎక్క‌డాలేని విధంగా రాష్ట్రంలో విభిన్న ప్ర‌తిభావంతుల‌కు సామాజిక భ‌ద్రత క‌ల్పించేందుకు రూ. 3 వేలు నుంచి రూ. 10 వేల వ‌ర‌కు పెన్ష‌న్లు అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకోసం ఏటా వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఉన్న‌త విద్యా కోర్సుల్లో 5 శాతం సీట్ల‌ను దివ్యాంగుల‌కు కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీచేయ‌డ‌మైంద‌న్నారు. అదే విధంగా ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీఅయిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను విభిన్న ప్ర‌తిభావంతులు స‌ద్వినియోగం చేసుకొని ఉన్న‌త‌స్థానాల‌కు ఏద‌గాల‌ని.. వారికి అమ్మ‌వారి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. గుణ‌ద‌ల‌లో వివిధ యాజ‌మాన్యాల కింద ఉన్న విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమ సంస్థ‌ల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు అందించ‌నున్న‌ట్లు ఎమ్మెల్యే విష్ణువ‌ర్ధ‌న్ తెలిపారు.

సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల సాధ‌న‌కు ఏకీకృతం: డైరెక్ట‌ర్ బి.ర‌విప్ర‌కాష్ రెడ్డి
రాష్ట్ర విభిన్న ప్ర‌తిభావంతులు, టీజీ, వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్ బి.ర‌విప్ర‌కాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది విభిన్న ప్ర‌తిభావంతుల కొర‌కు, విభిన్న ప్ర‌తిభావంతులతో, విభిన్న ప్ర‌తిభావంతుల చేత సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాలను సాధించేందుకు వారిని ఏకీకృతం చేయ‌డం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది అంత‌ర్జాతీయ విభిన్న ప్ర‌తిభావంతుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న‌ట్లు వివ‌రించారు. స‌మాజంలోని అన్ని వ‌ర్గాలు స‌మాన అవ‌కాశాలు పొందుతూ ముందుకెళ్లిన‌పుడే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విభిన్న ప్ర‌తిభాంతుల సంక్షేమానికి వివిధ కార్య‌క్రమాలు అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. విభిన్న ప్ర‌తిభావంతులైన ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అద‌నంగా ఏడు స్పెష‌ల్ సీఎల్‌లు మంజూరుచేసిన‌ట్లు వెల్ల‌డించారు. 21 ర‌కాల డిజేబిలీట్‌ను నోటిఫై చేసింద‌ని.. వారింద‌రికీ ప్ర‌త్యేకంగా స‌ర్టిఫికెట్లు జారీచేస్తున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్లు, అన్ని రంగాల్లోనూ విభిన్న ప్ర‌తిభావంతులకు మేలుచేకూర్చేలా వాతావ‌ర‌ణం, రాష్ట్ర‌స్థాయి స‌ల‌హా క‌మిటీలు, అర్జీల ప‌రిష్కారానికి ఏర్పాట్లు, విద్య‌, ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్లు త‌దిత‌రాల‌ను ర‌విప్ర‌కాష్‌రెడ్డి క్షుణ్నంగా వివ‌రించారు.
వేడుక‌ల్లో భాగంగా సాయిప్రేమ్, చేయూత‌, శిరీష రిహాబిలిటేష‌న్ సెంట‌ర్‌, విజ‌య‌మేరీ త‌దిత‌ర సంస్థ‌ల విద్యార్థుల సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. వేడుల‌క‌ను పుర‌స్క‌రించుకొని వినికిడి ప‌రిక‌రాలు, ట్రై సైకిళ్ల‌ను ల‌బ్ధిదారుల‌కు క‌లెక్ట‌ర్ డిల్లీరావు, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణువ‌ర్ధ‌న్, డైరెక్ట‌ర్ బి.ర‌విప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు అందించారు. వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని నిర్వ‌హించిన క్రీడా పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు.
కార్య‌క్ర‌మంలో రాష్ట్ర విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల స‌హ‌కార కార్పొరేష‌న్ ఎండీ ఎంకే కుమార రాజా, జిల్లా విభిన్న ప్ర‌తిభావంతులు, టీజీ, వ‌యోవృద్ధుల సంక్షేమ అధికారి వాడ్రేవు కామ‌రాజు, విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమ సంఘం ప్ర‌తినిధి బి.కిర‌ణ్‌రాజు, వివిధ ప్ర‌భుత్వ‌, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *