Breaking News

అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు : సీఎం  వైయస్‌.జగన్‌

-తుఫాను ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం వైయస్‌.జగన్‌.
-తుపాను నేపధ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు.
-సీఎం ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన కదిలిన ప్రభుత్వ యంత్రాంగం.
-ఇప్పటివరకు సుమారు 1 లక్ష టన్నుల ధాన్యాం సేకరణ.
-మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపిన అధికారులు
-ఖరీప్‌ పంటల కాపాడుకోవడం ప్రధానం
-కలెక్టర్లు,ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలి
-ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదు
-బాధితులు క్యాంపు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వెళ్లాలి
-గతంలో మాదిరిగా కాకుండా కుటుంబానికి మరో రూ.500 పెంచి రూ.2500 ఇవ్వాలి
-వర్షాలు తగ్గిన వెంటనే నష్టాన్ని అంచనా వేయాలి
-అధికారులకు ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ నిర్దేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఇంకా ఏమన్నారంటే… తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. హుద్‌ హుద్‌ లాంటి పెద్ద తుఫానులను కూడా మన రాష్ట్రం చూసింది. అటువంటి తుపాన్లును సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మంచి అనుభవం మన అధికారులకు ఉంది.
210 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా..ఈ తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాలి.
రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అప్పుడు గంటకు 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారు. వర్షాలు కూడా కురుస్తాయి. 7వ తేదీ నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయి.

దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్లు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరు చేశాం. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం.
తిరుపతికి రూ.2 కోట్లు, మిగిలిన జిల్లాల్లో రూ.1 కోటి చొప్పున ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు కూడా మరోరూ.1 కోటి మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చాం.
ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులు నియమించాం. వీరంతా కూడా జిల్లాల్లో యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. ఇవాళ సాయంత్రం నుంచి మీ ఈ జిల్లాల్లో అందుబాటులో ఉంటారు.

ఇవన్నీ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లు అందరూ చాలా ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. ప్రతి కలెక్టర్, ఎస్పీ దీన్నొక సవాలుగా తీసుకుని పనిచేయాలి. ఎలాంటి ప్రాణనష్టం జరగడానికి వీలులేదు. మనుషులుతో పాటు పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు. ఆ మేరకు తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

ఒకవైపు ఇది చేస్తూనే.. మరోవైపున ఖరీప్‌ పంటల సంరక్షణకు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా ధాన్యంపై ప్రత్యేక ధ్యాస పెట్టాలి. కోతకు వచ్చిన ఖరీప్‌ పంట కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పటికే 97 వేల టన్నులు సేకరించాం. మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే…పంట ఇంకా ఎక్కడ కోత కోయలేదో… దాన్ని వాయిదా వేసే విధంగా రైతులకు నచ్చజెప్పాలి.

అదే టైంలో కోసిన పంటను కచ్చితంగా సేకరించాలి. తేమ ఉన్న ధాన్యం అయినా, రంగు మారిన ధాన్యాన్నైనా కచ్చితంగా సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టాలి. యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ పీరియడ్‌లో రైతు మనకు అత్యంత ప్రాధాన్యమున్న వ్యక్తి. రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా ధాన్యం సేకరించాలి.

తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి అక్కడ వారిని సురక్షతి ప్రాంతాలకు తరలించాలి. 181 సహాయ పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఈ 8 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. మొత్తంగా 308 సహాయ పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటుకు గుర్తించామని అధికారులు చెప్పారు. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ వేగంగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల వారిని అక్కడికి తరలించాలి. ఇప్పటికే 5 ఎన్డీఆర్‌ఎఫ్, మరో 5 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నారు.

ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏమిటంటే.. మన గ్రామాల్లో ఉన్న సచివాలయ వ్యవస్ధ, వాలంటీర్లు వ్యవస్ధ. ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం. ప్రతి 50–70 ఇళ్లకు ఒక వాలంటీర్‌ అందుబాటులో ఉన్న గొప్ప పరిస్థితి ఇతర రాష్ట్రాలకు లేదు.

మనం క్రియేట్‌ చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను ఎంత సమర్ధవంతంగా వాడుకోగలిగితే.. అంత మంచి ఫలితాలు వస్తాయి. ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తుపాను వల్ల, తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి.

మనం ఏర్పాటు చేస్తున్న సహాయ శిబిరాలలో మనం వెళితే ఎలాంటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, భోజనం, వసతి ఉండాలని కోరుకుంటామో.. అదే తరహాలో అక్కడ సౌకర్యాలు ఉండేలా చూడాలి. మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి. కాస్త డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదు. సదుపాయాల విషయంలో ఎలాంటి లోటు రాకూడదు.

బాధితుల పట్ల మానవతాధృక్ఫధంతో మెలగాలి. బాధితులు క్యాంపు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వెళ్లాలి. ప్రతి ఒక్కరికీ రూ.1000 ఇవ్వాలి. కుటుంబానికి అయితే గతంలో మాదిరిగా కాకుండా మరో రూ.500 పెంచి రూ.2500 ఇవ్వాలి. క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వెళ్లాలి.
క్యాంపులకు రాకుండా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వారికి, క్యాంపు నుంచి మరలా వాళ్ల ఇళ్లకు వెనక్కి వెళ్లేవారికైనా వారికి అందాల్సిన 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలో చొప్పున అందించాలి. ఈ రేషన్‌ వారికి సకాలంలో సక్రమంగా అందించాలి.

తుపాను ప్రభావంతో గాలులు, వర్షాలు వల్ల దెబ్బతిన్న గుడిసెలు, ఇళ్లు ఉంటే వారి పట్ల మానవతా ధృక్ఫధంతో సాయం చేయాలి. తక్షణమే రూ.10 వేలు ఇచ్చి… వారిని ఆదుకోవాలి. వారు కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేట్టు దయతో, సానుభూతితో అందించాలి. సకాలంలో పరిహారం అందించాలి. తుపాను తగ్గు ముఖం పట్టిన 48 గంటల్లో ఇవి చేయాలి. అప్పుడే వారికి సంతోషాన్ని ఇవ్వగలుగుతాం.
గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను సక్రమంగా వినియోగించుకుని బాధితులను గుర్తించడంతో పాటు నష్టాన్ని అంచనా వేయాలి. సకాలంలో వారికి ఇవ్వాల్సినవి అందించాలి.

ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపైనా దృష్టి పెట్టాలి. తాగునీటి సౌకర్యాలు, జనరేటర్‌ ఏర్పాటు, బాలింతలు, గర్భిణీలను ఆసుపత్రులకు తరలించడం వంటి కీలక అంశాలను కూడా త్వరితగతిన చేపట్టాలన్న సీఎం.
వర్షాలు తగ్గిన తర్వాత కూడా ఎలాంటి అలక్ష్యానికి తావులేకుండా… వెంటనే సహాయ చర్యలు చేపట్టాలన్న సీఎం.
అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి. విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే మరమ్మతులునూ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి.

తుపాను తీరం దాటి, వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టంపై వెంటనే ఎన్యూమరేషన్‌ పూర్తి చేయాలి. దీనికోసం మీకు తగిన టైం ఇచ్చిన తర్వాత… నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా ? లేదా? అని అడుగుతాను. మా కలెక్టర్‌ బాగా చేశారు అన్న మాట ప్రజల దగ్గర నుంచి వినడం కోసం.. ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం నేను మీ దగ్గరకు వస్తాను. తనుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను.
నాకు సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట ఒక్క మనిషి నుంచి కూడా వినిపించకూడదు. మా కలెక్టర్‌ బాగా చూసుకోలేదన్న మాట కూడా వినిపించకూడదు. సంతృప్తకర స్ధాయిలో బాధితులందరికీ సహాయం అందాలి. ఈ విషయాన్ని కలెక్టర్లు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు కూడా జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు.

సహాయచర్యల కోసం డబ్బులుకు సంబంధించి.. ఇంకా రూ.2 కోట్లు కంటే ఎక్కువ అవసరమైతే .. వెంటనే పంపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం. సీఎస్‌, రెవెన్యూ ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులంతా అందుబాటులో ఉన్నారు. ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో మేం ఉంటాం. మీకు ఏం కావాలన్నా వెంటనే అడగండి. మీకు ఏం కావాలన్నా వెంటనే ఏర్పాటు చేస్తాం. అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి అని సీఎం కలెక్టర్లకు నిర్దేశం చేశారు.

హోం, విపత్తు నిర్వహణ శాఖమంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ బి రాజశేఖర్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, వ్యవసాయం, పశుసంవర్ధకశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్‌ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్, సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ ఎండీ జి వీరపాండియన్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *