మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మిచౌంగ్ తుఫాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు కృష్ణాజిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో తుఫాన్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎస్పీ పి జాషువా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని కృష్ణాజిల్లాలో తుఫాన్ పరిస్థితులు తీసుకున్న చర్యలు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో తుఫాన్ ప్రభావానికి గురయ్యే 7 మండలాల్లో లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. 64 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 2 వేల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించినట్లు, ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని, సోమవారం సాయంత్రానికి మొత్తం 8 వేల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించుటకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
రిలీఫ్ క్యాంపులలో ఆహారం, తాగునీరు, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చలి తీవ్రత దృష్ట్యా బాధితులకు దుప్పట్లు అందజేస్తున్నట్లు దోమతెరలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పిల్లలు గర్భవతులు బాలింతలకు పాలు అందిస్తున్నట్లు తెలిపారు. డెలివరీ సమయం దగ్గర పడిన గర్భవతులను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపినట్లు తెలిపారు. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులను ఒప్పించి రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నట్లు తెలిపారు.
నాగాయలంక మండలంలో ఏడు దీవులలో 4500 మంది జనాభా ఉన్నారని, వీరిని మెయిన్ ల్యాండ్ కు షిఫ్ట్ చేయుటకు మోటార్ బోట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తుఫాన్ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది మినిట్ టూ మినిట్ సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రాణ, పశు, పంట నష్టం ( human, animal, crop) జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
కలెక్టర్ ప్రెస్ బ్రీఫింగ్
అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ మీడియా ప్రతినిధులతో తో మాట్లాడుతూ రిలీఫ్ క్యాంపుల్లో బాధితులకు మంచి ఆహారం, తాగునీరు, పిల్లలకు బాలింతలకు, గర్భవతులకు పాలు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు రిలీఫ్ క్యాంపులను ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
రిలీఫ్ క్యాంపులకు వచ్చిన వారు ఇళ్లకు వెళ్లేటప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటే 1000/- రూపాయలు, ఒక్కో కుటుంబానికి 2000/- రూపాయలు చొప్పున, తుఫాన్ కు దెబ్బతిన్న పూరి గుడిసెకు 10 వేల రూపాయలు చొప్పున ఇచ్చి, వారు గుడిసెలు పునర్నిర్మించుకొనుటకు అధికారులు సహకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
ఎలాంటి ప్రాణ నష్టం గానీ, పశువుల నష్టం గానీ, పంట నష్టం గానీ జరక్కుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతూ అధైర్య పడవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
మచిలీపట్నం, అవనిగడ్డలలో రెండు రాష్ట్ర విపత్తు నివారణ సహాయక దళం(ఎస్డిఆర్ఎఫ్) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
ఇప్పటివరకు జిల్లాలో 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు, మరో 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆఫ్లైన్లో మిల్లులకు పంపినట్లు, గతరాత్రి 20 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం గోడౌన్స్ లకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ లకు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.
జిల్లా ఎస్పీ పి జాషువా మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ 86pపునరావాస సహాయ కేంద్రాలకు ప్రజలను తరలించుటకు పోలీస్ బృందాలు సహకరిస్తాయని తెలిపారు. విద్యుత్, మొబైల్ సిగ్నల్స్ అంతరాయం కలిగినప్పుడు వైర్లెస్ సెట్స్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, తుఫాను అనంతరం వారిని ఇంటికి క్షేమంగా పంపే వరకు పోలీస్ సిబ్బంది సహాయంగా ఉంటుందన్నారు. ముంపు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులలో ప్రజలను సంరక్షించేందుకు ఈత వచ్చిన పోలీస్ సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
డిఆర్ఓ పెద్ది రోజా, జడ్పీ సీఈవో జ్యోతి బసు, బందరు ఆర్డిఓ ఎం వాణి దీనివల్ల సంబంధిత శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News