మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మిచౌంగ్ తుపాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరంగా చేపట్టింది. ముఖ్యంగా మి చౌంగ్ తుపాను ప్రభావిత మండలాలైన నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు, మచిలీపట్నం, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు సముద్రతీర మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు ఆయా మండలాల పరిధిలో తుపాన్ షెల్టర్లు, పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించి అవసరమైన వసతులను ఏర్పాటు చేశారు. అనంతరం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను, శిధిలావస్థలో ఉన్న ఇల్లు గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలను దగ్గరలోని తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలకు తరలించారు.
నాగాయలంక మండల పరిధిలో 14 పునరావాస కేంద్రాలు, కోడూరు 6, మచిలీపట్నం 21, కృత్తివెన్ను 5, అవనిగడ్డ 4, మోపిదేవి 3, బంటుమిల్లి 4 కలిపి మొత్తం 57 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు మొత్తం 1,899 మంది ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి ఆయా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఉదయం పూట అల్పాహారం, పాలు, మధ్యాహ్నం, రాత్రికి భోజనం ఏర్పాట్లను చేశారు. తీవ్రతను బట్టి ఇంకా 7 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు ఈ రోజు సాయంత్రం తరలించే అవకాశం ఉండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లను చేశారు.
పునరావాస కేంద్రాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టి ఆహారం, మంచినీరు, విద్యుత్ సౌకర్యం, టార్చి లైట్లు, రైన్ కోట్లు, జనరేటర్లతో పాటు అన్ని అందుబాటులో ఉంచుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా కావలసిన మందులతో వైద్య శిబిరాలు అక్కడే ఏర్పాటు చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు పని చేసే విధంగా వైద్యులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది వారి ప్రధాన కార్య స్థానాల్లో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా కావలసిన మందులు ముఖ్యంగా పాము కాటు నివారణ మందు కూడా సిద్ధంగా ఉంచుకున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులందరూ ఎప్పటికప్పుడు పర్యటిస్తూ అక్కడి ప్రజలను ముఖ్యంగా మత్స్యకారులను తుపాను సందర్భంగా పాటించవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించి వారిని అన్ని విధాల అప్రమత్తం చేస్తున్నారు.
మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకుండా నియంత్రించారు.
వారి పడవలను దెబ్బ తినకుండా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకునేలా ఏర్పాటు చేశారు. వారికి కావలసిన ఆహారము, మంచినీరు అన్నిటిని అందించి అన్ని విధాల ఆదుకున్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పరిశీలించి దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు సరైన స్థితిలో ఉండేలా ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా విద్యుత్ స్తంభాలకు అనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.
కలెక్టరేట్ తో సహా అన్ని ఆర్డీవోలు, తహసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ విభాగాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా ఏర్పాట్లు చేశారు.
కలెక్టరేట్లో 08672 252572, 252000 నంబర్‌తో తుఫాను సమాచారం గానీ సహాయక చర్యల కోసం గానీ సంప్రదించవచ్చని జిల్లా జిల్లా యంత్రాంగం తెలిపింది
సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలు సముద్రం వద్దకు వెళ్లకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో రైతులు కోత కోసిన 20 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వర్షాలకు తడిసి దెబ్బ తినకుండా ముందుగానే లారీలకు ఎక్కించి సురక్షితంగా గోదాములకు తరలించడం జరిగింది.
తుఫాను సహాయక చర్యల కోసం 37 మంది సభ్యులతో కూడిన ఎస్.డి.ఆర్ఏఫ్ బృందం అవనిగడ్డ లోను, 25 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం మచిలీపట్నంలోనూ సిద్ధంగా ఉన్నాయి.
Prajavartha Online Telugu News