-ఒక్కో కుటుంబానికి ఏటా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స
-ఆరోగ్యశ్రీ యాప్ ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించాలి: మంత్రి ఆర్కే రోజా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేదవాడి దగ్గరకు ఆరోగ్యశ్రీ సేవలు తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొనగా పేద ప్రజల సంజీవని…. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని, ఒక్కో కుటుంబానికి ఏటా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స, ఆరోగ్యశ్రీ యాప్ ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించాలని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
సోమవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సల వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, మరింత మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించే కార్యక్రమం, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడకు వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి అనే ఇలాంటి సందేహాలన్నింటికి వివరంగా ప్రతి ముంగిటకు వివరించే మెగా అవగాహన కార్యక్రమాన్ని లాంఛనంగా వర్చువల్ విధానంలో ప్రారంభించగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ నుండి
రాష్ట్ర పర్యాటక, యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సత్యవేడు ఎమ్మెల్యే కె. అదిమూలం, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో మరిన్ని మెరుగులు దిద్దుతూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి మరింత జీవం పోస్తూ.. ఆరోగ్యశ్రీలో అతిపెద్ద మైలురాయిని తెలిపారు. ఇక నుంచి డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చయినా పూర్తి ఉచితంగా చికిత్స ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకంపై మరింత అవగాహన కల్పిస్తూ.. కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ తో పాటు ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, అశావర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు సూచించారు.
ప్రతికార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన వివరాలపై లబ్ధిదారునికి పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు.
ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరిచిన క్యూఆర్ కోడ్‌తో లాగిన్ అవ్వడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టు సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మాప్స్ ద్వారా ఆనుసంధానించబడిన మార్గాలు, ఆరోగ్య మిత్ర కాంటాక్ట్ నెంబర్లు తెలుసుకునే వెసులుబాటు తద్వారా రోగి ఆరోగ్యపరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన, మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు సులభతరం చేయాలని ఆదేశించారు.
మన జగనన్న ప్రభుత్వంలో వైద్యం ఖర్చు రూ.1,000 దాటిన చికిత్సలకు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలనే తాపత్రయంతో చికిత్స వ్యయ పరిమితి రూ.25 లక్షల వరకు పెంపు.
క్యాన్సర్ వ్యాధికి ఎలాంటి పరిమితి లేకుండా ఉచిత చికిత్స. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరాపై మన ప్రభుత్వంలో ఏడాదికి చేసిన వ్యయం రూ.4,100 కోట్లు. వైద్య రంగంలో కేవలం సంస్కరణలపై ఈ 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం చేసిన, చేస్తున్న మొత్తం వ్యయం దాదాపు రూ.32,279 కోట్లు.
క్యాన్సర్ లాంటిప్రాణాంతకమైన వ్యాధులకు ఎలాంటి పరిమితులు లేకుండా నాలుగున్నర సంవత్సరాల కాలంలో వీటి మీద రూ.1,897 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.
వైఎస్సార్‌ఆరోగ్య ఆసరా ద్వారా రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5,000 అలా ఎన్నిరోజులైనా డాక్టర్ల సూచన మేరకు ఆరోగ్య ఆసరా అందిస్తూ ఇప్పటివరకు 25,27,870 మందికి రూ.1,310 కోట్ల అందజేయడం జరిగిందని తెలిపారు.
గత ప్రభుత్వంలో వలె వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఊరిలోనే మీ వద్దనే ఉచిత వైద్యం అందించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ప్రతి మండలానికి కనీసం రెండు పీ.హెచ్.సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనంలో అనుసంధానం.. ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే మరొక డాక్టరు తనకు కేటాయించిన గ్రామాలలోని డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, పాఠసాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్తగా 53,126 వైద్య సిబ్బంది నియామకం చేయడం జరిగిందన్నారు. గతంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభించడం జరిగిందన్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్య 2,304 కి పెంపు. ఆరోగ్యశ్రీ సేవలు పొందిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని తర్వాత ఆసుపత్రులకు క్రమం తప్పకుండా బిల్లుల చెల్లింపు.
ఆపత్కాలంలో ప్రజల ప్రణాలకు భరోసా కల్పించేలా 1,704 వాహనాలు 104,108 సేవలు కోసం కొనుగోలు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో కలిపి అందుబాటులో ఉన్న మొత్తం 2204 వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, పట్టణ ప్రాంతాల్లో 542 అర్బన్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ –2 జనవరి 2024 నుంచి ప్రారంభం జరుగుతుందని, ప్రతి వారం గ్రామీణప్రాంతాల్లో మండలానికి ఒక గ్రామ సచివాలయంలో, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వారం ఒక వార్డు పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు.
అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియా తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత సేవలు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్యాన్ని స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు.
తెల్ల రేషన్ కార్డు కలిగి పేద కుటుంబం వారి వార్షక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారు అందరూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులందు ఉచిత వైద్యం పొందవచ్చునని తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి,ఆరోగ్య శ్రీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు.
నెట్‌వర్క్ ఆసుపత్రుల మొత్తం 2,304 కి పెంపుతో 3252 వివిధ రకాల జబ్బులకు రూ 25 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చునని తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు పొందిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని తర్వాత ఆసుపత్రులకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించడం జరిగిందని తెలిపారు.
2024 జనవరి నుండి జగనన్న ఆరోగ్య సురక్ష – 2 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు.
అనంతరం కొత్త స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు లబ్దిదారులకు మంత్రి, జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి,డి యం & హెచ్ ఓ డాక్టర్ శ్రీహరి ఇతర వైద్యాధికారులు, ఏ యన్ యం లు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News