– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అయోధ్యనగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇంచార్జి గుండె సుందర్ పాల్ తో కలిసి గురువారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పచ్చదనం పరిఢవిల్లితేనే మానవాళి మనగడ సాధ్యమవుతుందన్న విషయాన్ని బాధ్యతగల పౌరులందరూ గ్రహించాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోయి పట్టణాలు, గ్రామాలు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో.. మన ఇంటి పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎమ్మెల్యే అన్నారు. నానాటికి పెరుగుతున్న కాలుష్య కోరల నుంచి నుంచి బయటపడాలంటే.. మొక్కలను పెంచడం ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగనన్న పచ్చతోరణం పేరిట కొన్ని లక్షల మొక్కలు నాటినట్లు మల్లాది విష్ణు చెప్పారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటుతుండటంతో క్రమంగా నియోజకవర్గంలో పచ్చదనం పెరుగుతోందన్నారు. కొత్తగా నిర్మితమవుతున్న జగనన్న కాలనీలలోనూ తప్పనిసరిగా మొక్కలు పెంచాలనే నిబంధనను ప్రభుత్వం విధించిందని గుర్తుచేశారు. చెట్లే మానవ జాతికి గురువులని.. కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను దత్తత తీసుకోవాలని మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. మొక్కలను నాటి వదిలేయడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ట్రీ గార్డులను ఏర్పాటు చేయడం ద్వారా 95 శాతానికి పైగా మొక్కలను కాపాడుకోవచ్చన్నారు. ప్రభుత్వ అధికారులు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్ధలు పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. తత్ఫలితంగా విజయవాడ నగరమంతా పచ్చదనం పరిఢవిల్లుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News