Breaking News

2024లో దేశాన్ని రాజకీయంగా మలుపుతిప్పాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావవంతంగా పనిచేసి 2024లో దేశాన్ని రాజకీయంగా మలుపు తిప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అరుణ పతాకావిష్కరణలు అత్యంత ఘనంగా జరిగాయి. విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌ వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీకి విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలే అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేడు ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడిరదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వెనుకనుండి నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు స్వాతంత్య్ర కాలంలో బ్రిటీష్‌వారికి తొత్తులుగా వ్యవహరించారని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్‌ చంద్రబోసు వంటి విప్లవవీరులు ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. వచ్చే సార్వత్రికల్లో ఎక్కువ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని మూడవసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుటిల యత్నాలు చేస్తున్నదన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి మనువాదాన్ని అమలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన ప్రజల కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లౌకికతత్వాన్ని రక్షించుకోవటం కోసం వామపక్ష పార్టీలతో పాటు ప్రజాతంత్ర శక్తులు, ప్రజాస్వామ్యవాదులు ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. దేశ సంపదను కొల్లగొడుతున్న అంబానీ, అదానీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ శతవార్షిక వేడుకలు, భవిష్యత్‌ ఉద్యమాల గురించి ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగనున్న సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దురహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరులో జరిగే కార్యక్రమానికి వెళ్లేందుకు కేవలం 35 కిలోమీటర్ల దూరానికి హెలికాఫ్టర్‌లో వెళ్లటాన్ని తప్పుబట్టారు. సీఎం జగన్‌ అభద్రతా భావంలో ఉన్నారని తెలిపారు. శాంతిభద్రతలపై ఆయనకు నమ్మకం లేదన్నారు. గతంలో ప్రజల మధ్య తిరిగిన జగన్‌ ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాలను గద్దె దించాలని పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ 99ఏళ్ల క్రితం కేవలం 25 మంది యువకులతో కాన్పూర్‌లో ప్రారంభమైన భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను సమీకరించి కార్మికులు, కూలీలు, మహిళలు, పేదలను సమాయత్తపరిచి లక్షలాది మందిని పార్టీ సభ్యులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీని గద్దెదించి రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీకి వంతపాడుతున్న వైసీపీని కూడా ఇంటికి పంపించాలన్నారు. రాబోయే రోజుల్లో సీపీఐకి బాధ్యత మరింత పెరగనుందన్నారు.
సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ శతవార్షికోత్సవానికి పార్టీ లక్ష్యాలను పరిపుష్టం చేసేందుకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి అధ్యక్షుడు పి.చంద్రనాయక్‌ సారధ్యంలో విప్లవగీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *