గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు వార్డ్ సచివాలయాల వారిగా గుర్తించిన క్రీడా మైదానాల్లో ఉత్సాహపూరిత వాతావరణంలో సాగుతున్నాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రలో భాగంగా నగరంలో వార్డ్ సచివాలయాల వారిగా వాలీబాల్, కబాడీ, ఖోఖో, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ విభాగాల్లో రిజిస్టర్ చేసుకున్న క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. క్రీడా పోటీలకు అవసరమైన కిట్స్ కూడా అందించడం జరుగుతుందన్నారు. క్రీడాకారులు తమ టీం కి మ్యాప్ చేసిన మైదానానికి కేటాయించిన సమయానికి రావాలన్నారు. నోడల్ అధికారులు పోటీల నిర్వహణ, ఫలితాల వెల్లడి పై ఎప్పటికప్పుడు శాప్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అడ్మిన్ కార్యదర్శులు సచివాలయంలో రిజిస్టర్ చేసుకున్న టీంలు నిర్దేశిత సమయానికి వచ్చేలా పర్యవేక్షణ చేసుకోవాలన్నారు. ఎవరైనా మైదానాల వద్ద అప్పటికప్పుడు తాము కూడా ఆడతాము అంటే వారిని స్పాట్ రిజిస్టర్ చేయాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య అధికారులు క్రీడా మైదానాల వద్ద శానిటేషన్ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడలను చూడడానికి వచ్చే ప్రేక్షకులకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నోడల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లతో నగరంలో జరిగే ఆడుదాం ఆంధ్రా పోటీల నిర్వహణలో ఏ సమస్య లేకుండా సమన్వయం చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు.
Prajavartha Online Telugu News