విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని పునికి పుచ్చుకొని సామాజిక న్యాయం సాధికారితలను అన్ని రంగాల్లోను సృష్టించి సంక్షేమ ఫలాలను అన్ని వర్గాలకు అందించే విధంగా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఈ నెల 19వ తేదీ శుక్రవారం భారతరత్న డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రం లో విద్య, సామాజిక న్యాయం, సౌబ్రాతృత్వం తదితర అంశాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులు, యూనివర్సిటీల ఆయా విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు, మేధావులతో నిర్వహించిన సదస్సుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మయాన్మార్ నుండి వచ్చిన బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదిన జాతి గర్వించదగ్గ మహానేత, రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని, ఆలోచనలను అన్ని రంగాల్లోను అమలు చేస్తు ముందుకు సాగుతున్నామన్నారు. పేదరికం విద్యకు అడ్డుకాకూడదని, ఉన్నత విద్యకు దూరం కాకూడదని కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారన్నారు. బడుగు బలహీన అణగారిన వర్గాల వారికీ సామాజిక న్యాయం అందించాలనే ఆలోచనతో రాజకీయ, సామాజిక, ఆర్ధిక విద్య పరమైన అంశాలలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ చిట్టచివరి కుటుంబానికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతిరహిత సమర్ధవంతమైన పరిపాలనను జగనన్న ప్రభుత్వం ద్వారా చేరువచేశామన్నారు. సమాజంలోని అసమానతలకు పేదరికం ప్రధాన కారణంగా గుర్తించి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కేంద్రప్రభుత్వం విద్య హక్కు చట్టాన్ని తీసుకువస్తే మన ప్రభుత్వం అమలు చేస్తూ ప్రాధమిక స్థాయి నుండే ఆంగ్ల విద్యలో భోదిస్తున్నామన్నారు. యువతకు మనం ఇచ్చే ఆస్తి చదువే అని భావించి దానిపై పెట్టే ఖర్చు వారి భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడిగా భావించి నాడు-నేడు, జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా నిరుపేద పిల్లలకు సైతం నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా అంబేద్కర్ స్పూర్తితో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారిని క్యాబినెట్, కార్పొరేషన్ చైర్మన్లు, పాలక మండలి సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. ప్రతిఒక్కరు గౌరవప్రదమైన జీవితం గడపాలని ఉన్నతి పథకం, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను అందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సర్వోత్తమమైన మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. దేశంలో అసమానతలను రూపుమాపడానికి పేదవారి స్థితిగతులు మెరుగుపరచడానికి రాజ్యాంగ వ్యవస్థ ద్వారా హక్కు, అవకాశం కల్పించిన వ్యక్తి డా. బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని, సామాజిక న్యాయాన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పాలన చేస్తున్న వ్యక్తి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని అన్నారు. విద్యకు కోట్లాది రూపాయలు వెచ్చించి నిరుపేద పిల్లల స్థితిగతులను మెరుగుపరుస్తూ అంబేద్కర్ ఆశయాలను నిజం చేస్తున్నామన్నారు. గత పాలకులు డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిర్లక్ష్యం చేశారన్నారు. సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. డా. బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మన రాష్టంలో వీరాజిల్లుతుందని, ఆయన ఆలోచనలతో పాలన చేస్తు చరిత్ర పుటల్లో ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన పేరు లిఖించుకున్నారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.
కార్యక్రమంలో సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, సోషల్ జస్టిస్ అడ్వైజర్ జూపూడి ప్రభాకరావు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, పంచాయితీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి. జయలక్ష్మి, హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్ట్ టైల్స్ సెక్రటరీ కె. సునీత, స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎం.డి. గంధం చంద్రుడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి. వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ ఉన్నారు.
విద్య, సామాజిక న్యాయం, సౌబ్రాతృత్వం అంశాలపై సదస్సు నిర్వహించారు. హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్ట్ టైల్స్ సెక్రటరీ కె. సునీత ఆధ్వర్యంలో విద్యపై నిర్వహించిన సదస్సులో ఉన్నత విద్య మాజీ కార్యదర్శి ఆర్. సుబ్రమణ్యం, ఎస్వీ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కొలకలూరి ఇనాక్, ఏ ఎన్ యు వైస్ ఛాన్సలర్ ప్రొ. రాజశేఖర్, సెంటర్ ఫర్ మహాయాన బుద్దిస్ట్ స్టడీస్ ప్రొ. చల్లపల్లి స్వరూప రాణిలు, స్కూల్ ఎడ్యుకేషన్ మిడ్డే మీల్, శానిటేషన్ డైరెక్టర్ శోభిక ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక న్యాయం అంశంపై ప్రముఖ రచయిత కంచ ఐలయ్య , ఆకునూరి మురళీ, దళిత్ స్త్రీ శక్తి నేషనల్ కన్వీనర్ గడ్డం ఝాన్సీ, సీనియర్ ప్రొ. ఎస్. ఆర్మ్ స్ట్రాంగ్ లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి. వీరపాండియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌబ్రాతృత్వం అంశంపై గంట చక్రపాణి, సఫాయి కర్మచారి ఆందోళన్ ఫౌండర్ బెజవాడ విల్సన్, ప్రొ. ఎంఎం. వినోదిని, బుద్ధ వనం మరియు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్ పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్యలు ఉపన్యసించారు.
Prajavartha Online Telugu News