– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా కవి, సంఘ సంస్కర్త యోగి వేమన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతమైందని.. సామాజిక చైతన్యానికి ప్రతీక అని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. శుక్రవారం యోగి వేమన జయంతి సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావు వేమన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక చైతన్యంతో కూడిన వేమన పద్యాల సాహిత్య ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ సమాజంలోని వివిధ సమస్యలను భిన్న కోణాల్లో స్పృశించి.. వేమన తన పద్యాల్లో విలువలను చొప్పించారని పేర్కొన్నారు. నేటి తరానికి యోగి వేమన జీవితం, శతక సాహిత్యం గురించి అవగాహన పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో వేమన పద్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను స్పందింపజేస్తాయని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News