– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
శుక్రవారం వెలగపూడి సచివాలయం నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ముకేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024, ఓటర్ల తుది జాబితా ప్రచురణ, ఎన్నికల సిబ్బంది డేటా బేస్, ఆర్‌వో, ఏఆర్‌వోలకు శిక్షణ, జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) తదితరాలపై సీఈవో సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 22వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎన్నికల సిబ్బందిగా విధుల నిర్వహణకు అవసరమయ్యే ఉద్యోగుల డేటాబేస్ రూపకల్పనను పూర్తిచేయడంపై దృష్టిసారించినట్లు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఆర్‌వో, ఏఆర్‌వోల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం (ఎన్‌వీడీ) నేపథ్యంలో బూత్ స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News