– జిల్లాలో పథకం ద్వారా నాలుగో విడతలో 3,22,820 మంది మహిళలకు రూ. 279 కోట్ల లబ్ధి
– రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళా సాధికారత కోసం విప్లవాత్మక పథకాలు అమలుచేస్తోందని.. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా, ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత ఆర్థిక సాయాన్ని పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, కాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్ అడపా శేషగిరి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్ టి.జమల పూర్ణమ్మ, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ టి.చంద్రశేఖర్, లిడ్‌క్యాప్ డైరెక్టర్ ఝాన్సీరాణి, ఎల్డీఎం కె.ప్రియాంక తదితరులతో కలిసి వర్చువల్‌గా హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత ఆర్థిక సహాయానికి సంబంధించి మెగా చెక్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం నాలుగో విడత ద్వారా జిల్లాకు సంబంధించి 32,431 స్వయం సహాయక సంఘాలకు చెందిన 3,22,820 మంది సభ్యులకు రూ. 278.92 కోట్ల మేర లబ్ధి చేకూరుతోందని తెలిపారు. మహిళలకు ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలవుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలి:
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయ సంఘాల మహిళల ఆర్థిక పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. కుటుంబాలకు సుస్థిర ఆదాయం వచ్చేలా జీవనోపాధి అవకాశాలను అందిపుచ్చుకొని.. ఆత్మస్థైర్యంతో తమకాళ్లపై తాము నిలబడి ఆదర్శంగా నిలిచినప్పుడే ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరుతాయన్నారు. మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎందరో వ్యాపారాలను విజయవంతంగా నడుపుతున్నారని.. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ, మెప్మా అధికారులతో పాటు స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News