తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా శాఖ పై రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ప్రతి బడి ఈడు పిల్లవాడు బడిలో ఉండేలా విద్యా శాఖ కృషి చేయాలని, గృహ నిర్మాణంపై రోజువారీ సమీక్షతో ప్రణాళికా బద్ధంగా పురోగతి సాధించాలని, మాతా శిశు సంక్షేమం, అభివృద్ధి శాఖ మాతా శిశు మరణాలను తగ్గించేలా, వారికి వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ సక్రమంగా అందేలా చూడాలని, గ్రామ వార్డు సచివాలయాలు ప్రజలకు విస్తృత సేవలు అందించాలని పలు అంశాలపై సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ముందుగా విద్యా శాఖ, సర్వ శిక్ష అభియాన్, కేజిబివి, ఆదర్శ పాఠశాలలు, నాడు నేడు కింద చేపడుతున్న నిర్మాణాలు, మరమ్మత్తులు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా డి ఈ ఓ వి. శేఖర్ విద్యా శాఖ కార్యకలాపాలపై వివరించారు. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద నాణ్యతగా అమలు కావాలని, ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్ ల ఏర్పాటుతో పాటశాలల్లో నూతన టెక్నాలజీ తో పిల్లలకు మంచి బోధన అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, విద్యార్థులకు ప్రభుత్వం బైజ్యూస్ ట్యాబ్ లు పంపిణీ చేయడం జరిగిందని, తద్వారా పిల్లలకు తరగతులు అయిపోయిన తర్వాత కూడా వారికి ఏమైనా సబ్జెక్ట్ పై సందేహాలు ఉన్నా క్లారిఫై చేసుకునే అవకాశం ఉందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చూడాలని తెలిపారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధునిక హంగులతో రూపు దిద్దుకున్నాయని, పెండింగ్ నాడు నేడు పనులు సకాలంలో గడువు లోపు పూర్తి చేసేలా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్య, బాలికా విద్యను ప్రోత్సహించేలా చర్యలు ఉండాలని, ప్రతి బడి ఈడు పిల్లవాడు బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వేంకటేశ్వర రావు వివరిస్తూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, గ్రామీణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన 74706 గృహాలలో నేటివరకు 27240 గృహాలు పూర్తి అయ్యాయని, మిగిలినవి 73 శాతం పునాది మరియు ఆపై స్థాయిలో పురోగతిలో ఉన్నాయని తెలుపగా రోజువారీ సమీక్షతో పురోగతి సాధించాలని కలెక్టర్ సూచించారు. ఆప్షన్ 3 కేటగిరీ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులు వారి ఇంటి నిర్మాణ స్థలం వద్ద జియో ట్యాగింగ్ తో ఫోటో దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందని దానికొరకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐసిఐసిఐ అకౌంట్ ఓపెనింగ్ పెండింగ్ ఏమైనా ఉంటే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పై సమీక్షిస్తూ అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నడిచేలా పర్యవేక్షించాలని, పిల్లలకు పౌష్ఠిక ఆహారం అందించాలని, బాలింతలకు అందించాల్సిన వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ, ఆరోగ్య పరీక్షలు, తదితరాలు వారికి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాతా శిశు మరణాలు లేకుండా ప్రతి గర్భిణికి ఆసుపత్రుల్లో ప్రసవం అయ్యేలా చూడాలని తెలిపారు. జువెనైల్ జస్టిస్ బోర్డ్ వివరాలపై సమీక్షిస్తూ రీహాబిలిటేషన్ వివరాలు అందుబాటులో ఉండాలని సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చిల్డ్రన్ హోమ్ చేపడుతున్న కార్యక్రమ పురోగతిపై సమీక్షించారు. మిషన్ వాత్సల్య స్కీం, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పిఎం కేర్ స్కీం, బేటీ బచావో బేటీ పడావో తదితర వివరాలు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ సమీక్షలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, నోడల్ అధికారి వాసంతి, డిసిపిఓ శివ శంకర్ పాల్గొన్నారు.
అనంతరం జిల్లా గ్రామ వార్డు సచివాలయం శాఖ పై జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి సుశీల దేవి సచివాలయం వ్యవస్థ పని విధానాన్ని వివరించగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ముంగిటకు పరిపాలన అందిస్తూ అనేక సేవలకు సచివాలయాలు కేంద్ర బిందువులా ఉన్నాయని, సమర్థవంతంగా సచివాలయం సిబ్బంది పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అని అన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సిఈఓ మరియు డిఎల్డిఓ ఆదిశేషా రెడ్డి, డిఎల్డిఓ లు వాణి, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News