-పవన్‌కళ్యాణ్, చంద్రబాబులకు గయాజుద్దీన్ వినతి
-ఆత్మీయ సమావేశం బల నిరూపణ కాదు…సంఘటిత్వానికి నిదర్శనం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెటు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తనకు కేటాయించాలని జనసేనాని పవన్‌కళ్యాణ్, తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబులకు జనసేన నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్ ఛైర్మన్ షేక్ గయాజుద్దీన్ (ఐజా) విజ్ఞప్తిచేసారు. శుక్రవారం భవానీపురంలోని మసీదు రజా వీధిలో గయాసుద్దీన్ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో మసీదే రజా కమిటీ ప్రెసిడెంట్ ఖలీల్, సెక్రటరీ సాదిక్, పెద్దలు భాషాభాయ్ తదితరులతో పాటుగా పలువురు ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో గయాసుద్దీన్ మాట్లాడుతు జనసేన-టిడిపి పొత్తును అభినందిస్తూ ముస్లిం మైనార్టీలు పెద్దయెత్తున రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. బిజెపితో పొత్తుపై ముస్లిం మైనార్టీల్లో అనుమానాలు వుంటే మా నాయకుడు పవన్‌కళ్యాణ్ ముస్లింలకు దేశంలో ఏదైనా జరిగితే వారికి అండగా ముందు నిలబడేది నేనేనని మాకు తెలియచేసారన్నారు. వైసీపీ పాలనలో రాజ్యాంగం ప్రకారం మైనార్టీలకు రావాల్సిన వాటా, రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా రావాల్సిన ప్రభుత్వ సబ్సీడీలు రాలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో హామీలిచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిలో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. హజ్ హౌస్ నిర్మాణం వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. నాడు హజ్ హౌస్ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేసారని, అటుపై జగన్మోహనరెడ్డి నిర్మిస్తామని చెప్పినా ఆచరణలో మాత్రం చేయలేదని అన్నారు. ఇందాద్‌ఘర్ శిధిలావస్థకు చేరినా మరమ్మతులు కూడా చేయడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే ఉపయోగించుకున్నాడని గయాసుద్దీన్ ధ్వజమెత్తారు. పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లి ఓడిపోతాడనే ఇక్కడ నుంచి వెలంపల్లిని సెంట్రల్ నియోజకవర్గంనకు మార్చారని విమర్శించారు. వన్‌టౌన్ తర్వాత అత్యంత ముస్లింజనాభా వున్న భవానీపురంలో ఎమ్మెల్యే వెలంపల్లి, వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసారని సూటిగా ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంనుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు ముస్లిం మైనార్టీలకు చేసిందేమీలేదని విమర్శలు గుప్పించారు. అధికార వైసీపీ పార్టీ ముస్లింలకు ఎన్నో హామీలిచ్చి బుట్టదాఖలా చేసిందన్నారు. ముస్లింలకు రుణమాఫీ అమలుచేయలేదని అన్నారు. కోస్తాంధ్ర నుంచి విజయవాడ వరకూ ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వగలది ఒక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాత్రమేనని గయాజుద్దీన్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు చేసిన న్యాయం ఏమిటో వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు. షాహుస్సేన్ ఖాద్రీదర్గాలను కూలగొట్టి భక్తులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ముస్లింలను ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదని అన్నారు. ముస్లింలకు సరైన నాయకత్వం లేక వెనకబడ్డారన్నారు. ముస్లింలకు ఒక్కశాతం కూడా ఎమ్మెల్యే నుంచి మర్యాదగానీ, గౌరవం కానీ లేదన్నారు. మీకోసం పనిచేసేవారు కావాలా లేక మోసం చేసి వెళ్లిపోయేవారు కావాలా అని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్, చంద్రబాబు ఆశయాలను ముస్లింల వద్దకు తీసుకువస్తానని అన్నారు. ఈసారి ముస్లింలంతా జనసేనపార్టీతో ప్రయాణంచేయాలని గయాజుద్దీన్ పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సదస్సులో వందలాదిమంది పాల్గొనడం అభినందనీయమని అన్నారు.
Prajavartha Online Telugu News