విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 11వ తేదీన ఇచ్చాపురంలో శంఖారావం సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా పిలుపునిచ్చారు. శనివారం విజయవాడ వన్‌టౌన్ గణపతిరావు రోడ్డులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మొహమ్మద్ ఫతావుల్లా మాట్లాడుతూ నేటి నుంచి ఉత్తరాంధ్ర పర్యటనలో శంఖారావం ప్రారంభకానుందని, శంఖారావం పేరుతో ఈయాత్రను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్నారన్నారు. మొత్తం 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర జరుగుతోందన్నారు. పార్టీ క్యాడర్‌ను, నేతలు సమాయత్తం చేసేందుకు లోకేష్ ఈ యాత్రను చేపట్టారన్నారు. ఈ యాత్రను రాష్ట్రంలోని ముస్లీం మైనారిటీ సోదరులు విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు సీఎం కావాలని ప్రజలంతా కోరుతున్నారని ఆయన అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజా సేవ కోసం కృషి చేస్తున్న వారిని పార్టీ ఎప్పడు గుర్తిస్తుందన్నారు. వైసీపీకి కోవర్టుగా ఎంఎస్ బేగ్ పని చేస్తున్నారని, ఇప్పటికి కేశినేని నానికి టచ్‌లో ఉన్నారన్నారు. టిడిపి కార్యకర్తలకు ఎంఎస్ బేగ్్ తానే పశ్చిమ ఇంచార్జ్ అంటూ తన అసత్య ప్రచారంతో అయోమయంలో ఉంచుతున్నారని విమర్శించారు. ఇలా టీడీపీలో ఉంటూ వైసీపీకి కోవర్టుగా ఉన్నవారిని పార్టీ గుర్తించదన్నారు. తాను టిక్కెట్ అడగడానికి అర్హుడనని, అయితే టిక్కెట్ ఎవరికి ఇచ్చినా టిడిపికి ఎల్లవేళలా విధేయుడుగా ఉంటానని ఫతావుల్లా చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ మైనారిటీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి బడేషా, కార్యదర్శి జహీద్, అబ్దుల్ హాదీ, అన్సార్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News