అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన సాగుతుంది. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారు.తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయి. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించారు. తొలి దశలో ముఖ్య నాయకులు, ప్రభావశీలురు, ముఖ్యులతో సమావేశాలు ఉంటాయి. రెండోసారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు,వీర మహిళల సమావేశాలలో పాల్గొంటారు.మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఎన్నికల ప్రచారం చేపట్టేనాటికి పవన్ కళ్యాణ్ మూడుమార్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధం అవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్దం చేస్తోంది.
Prajavartha Online Telugu News