విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఆంధ్రా హాస్పటల్లో హీలింగ్ లిటిల్హార్డ్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈనెల 12 నుంచి 17 వరకూ నిర్వహించిన 28వ ఉచిత క్యాంపులో 25 మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు మాట్లాడుతూ రిపేర్ ఆఫ్ వాస్క్యులర్ రింగ్, టెట్రాలజీ ఆఫ్ ఫాలో ఆబ్సెంట్ పల్మనరీ వాల్వ్, టెట్రాలజీ ఆఫ్ ఫాలో డబుల్ అవుట్లెట్ రైట్ వెంట్రికల్, రిపేర్ ఆఫ్ అబ్జెయిన్స్ అనామలీ, పార్శియల్ అనోమలీస్ పల్మనరీ వీనస్ డ్రైనేజ్, పల్మనరీ వాల్వ్ రీప్లేస్మెంట్ వంటి అత్యంత క్లిష్టతరమైన గుండె జబ్బులున్న వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. ఎనిమిదేళ్లుగా 28 సార్లు చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆరు రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరంలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ప్రేమ్, కార్డియాక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సర్పరాజ్ రహీమాన్, యూకేకు చెందిన డాక్టర్ ఆనంద్ వాఫ్‌ు, ఆక్టివియా, లీనాలతో పాటు ఆంధ్రా హాస్పటల్ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్, కార్డియాక్ సర్జన్ డాక్టర్ దిలీప్‌లు శస్త్ర చికిత్సల్లో పాల్గొన్నట్లు తెలిపారు. నెలకు 50 నుంచి 60 సర్జరీలు జరిగాయని తెలిపారు. ఏడాదికి సుమారు 600 పిల్లల గుండె సర్జరీలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 4వేలు సర్జరీలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అనంతరం అమెరికాలో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రాహాస్పిటల్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించి తమవంతు సహకారంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సమావేశంలో వైద్యులు శ్రీమన్నానారాయణ, విక్రమ్, సర్ఫరాజ్ రహెమాన్, ఆనంద్, రమేష్, తదితర వైద్యులు, శస్త్ర చికిత్సలు చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News