-ఏపిసిసి చీఫ్ వై.ఎస్.షర్మిలా రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని కేంద్రములోను రాష్ట్రంలోను కాంగ్రెస్ అధికారములోనికి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదానే అని ఏపిసిసి చీఫ్ వై.ఎస్.షర్మిలా రెడ్డి స్పష్టం చేసారు. బుధవారం ఆంధ్రరత్న భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి మాట్లాడుతూ బిజెపి, టిడిపి మరియు వైకాపా పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసారని ఆమె ఆరోపించారు. ఒక విధంగా రాష్ట్ర ప్రజలను వంచించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5,000/- చొప్పున ఆ ఇంటి గృహిణికి ఖాతాలో జమ అయ్యేటట్టుగా ఆర్థిక సహాయం అందిస్తామని ఆమె తెలియజేసారు. అనంతపురంలో జరిగిన సభలో జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఈ పథకాన్ని ప్రారంభించారని ఆమె తెలియజేసారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలోను పూర్తి చేయకుండా కాలయాపన చేసారని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వచ్చివుంటే భారీ పరిశ్రమలు వచ్చేవని రాయతీలతో కూడిన వసతులు ఏర్పాటు అయ్యేవని, వాణిజ్య పన్ను, ఆదాయ పన్ను కట్టకుండా రాయతీలు ఇచ్చేవారని అమె గుర్తు చేసారు. 970 కి.మీ. తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా వచ్చివుంటే హార్డ్వేర్ హబ్, పెట్రోలియమ్ రీసెర్చ్ సెంటరును తీసుకొస్తామని చెప్పిన అధికార పార్టీలు నిరాశపరచాయని ప్రజలకు అన్యాయం జరిగిందని ఆమె తన అవేదనను వ్యక్తంచేసారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే, బిజెపి పాలకులు 10 సంవత్సరములు ఇస్తామని చెప్పి చివరకు మట్టి నీళ్ళు అందించారని ఆమె బిజెపి, టిడిపి మరియు వైకాపా పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా విషయముపై ఎవరికి చిత్తశుద్దిలేదని ఆమె అన్నారు. రాష్ట్ర అభివృద్ధికోసం మార్చి 1వ తేదీన ఒక డిక్లరేషన్ చేయబోతున్నామని వై.ఎస్.షర్మిలారెడ్డి తెలియజేసారు. ఈ రాష్ట్ర అభివృద్ధికోసం ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను బలపరచాలని చివరగా రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు.
Prajavartha Online Telugu News