రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యచరణ రూపొందించడం, సమర్థవంతంగా అమలు చేపట్టే ప్రక్రియ లో భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు. మంగళ వారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎస్పీ పి. జగదీష్, మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, డి టి సి కెవి కృష్ణా రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు కారణంగా ప్రజల గాయ పడకుండా, మృతి చెందకుండా చేపట్ట వలసిన చర్యలపై సంభందిత శాఖల అధికారులతో ప్రణాళికా సిద్దం చేసుకొని ఆచరణ లోకి తీసుకుని రావాలని కోరారు. జాతీయ , ఇతర అనుబంధ రహదారుల్లో రహదారి ప్రమాదాల నియంత్రణకు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ప్రతిపాదించిన పనులను పూర్తి చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించారదనీ పేర్కొన్నారు. రహదారి ప్రమాదాల్లో ఎవరివో ప్రాణాలు పోతాయని… మొక్కుబడి రీతిలో అప్పగించిన పనులు చేయకుండా పోలీస్, రవాణా, మున్సిపల్ అధికారులు రహదారి నియంత్రణకు సూచించిన పనులను ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో రహదారి ప్రమాదాల వల్ల వైకల్యంకి గురి కావడం కానీ, మరణించడం కానీ జరుగకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యం అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సంభందిత శాఖల అధికారులు రహదారి ప్రమాదాలు జరుగకుండా ఖచ్చితమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రతా సమావేశాల్లో సూచించిన అంశాలను ప్రాధాన్యతగా భావించి నెల రోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోడ్ కం రైల్ బ్రిడ్జి రెండు వైపులా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, నిఘా పెంచాలని, అనుమతి లేని వాహనాల రాకపోకలు నియంత్రించాలనీ స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ పి . జగదీష్ మాట్లాడుతూ బ్లాక్ స్పాట్ లని గుర్తించడం జరిగిందనీ, ఆయా ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరికల సూచికలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్ హెచ్ అధికారులు జాతీయ రహదారుల్లో ప్రమాదాల నియంత్రణకు సూచించిన భద్రతా చర్యలు చేపట్టలేదని వెంటనే ఆమేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.. జాతీయ రహదారుల్లో హైవే పెట్రోలింగ్ వాహనాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నట్లు అధికారులు వెల్లడించారు. . జిల్లాలో గత రెండు సంవత్సరాలతో పోలిస్తే భద్రతా చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాల వల్ల గాయాలు బారిన పడిన వాటి సంఖ్య తగ్గించడం జరిగిందనీ అధికారులు తెలియ చేశారు. హిట్ అండ్ రన్ కి సంబంధించి గాయ పడిన వారికి రూ. 50 వేలు, మరణించిన వారికి రూ 2 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందచెయ్యనున్నట్లు తెలియ చేశారు. గత ఏడాది అక్టోబర్ 10 న జరిగిన సమావేశంలో కమిటి సభ్యులు సూచించిన పనులను పూర్తి చేసినట్లు డి టి సి కృష్ణా రావు తెలిపారు.
ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్. పి. పి జగదీష్, మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఐ. ఏ ఎస్., జాతీయ రహదారుల పి. డి, రాజమహేంద్రవరం సురేంద్ర నాథ్, జిల్లా రవాణా అధికారి కె. ఎస్. ఎం. వి. కృష్ణారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి హెచ్. సంపత్ కుమార్ , ఎస్. ఎస్. రంగనాయకులు, జి. రామనారాయణ, బి. ఎస్. ఎస్. నాయక్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎన్. ఎల్. శ్రీదేవి, కార్యాలయ పర్యవేక్షకులు ఎల్. పెన్సిన్ బాబు మరియు తదితర జిల్లా అధికారులు, అధికారిణీలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News