రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు భూమిక ఎన్.జి.వో సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక అన్నపూర్ణమ్మ పేట సమీపంలో మహిళల సాధికారత మరియు మహిళల చట్టలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి కే . ప్రత్యూష కుమారి మాట్లాడుతూ మహిళలు వారి కుటుంబాలకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. పిల్లలను తీర్చిదిద్ది వారిని మంచి మార్గంలో నడిపించడంలో, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం లో మహిళల పాత్ర ముఖ్యమైనదని అన్నారు.
ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంలో మహిళలు విఫలమైతే కుటుంబ సభ్యులపై, పిల్లలపై ప్రభావం పడుతుందని వివరించారు. బాల్య వివాహాల వలన ఆడ పిల్లలకు కలిగించే నష్టాల గురించి వివరించారు. ఆడ పిల్లలను ఖచ్చితంగా చదివించా లని అన్నారు. పిల్లలకు స్వేచ్ఛ నివ్వడంతో పాటు వారి మంచి- చెడులు గమనిస్తూ ఉండాలని అన్నారు. వరకట్న నిషేధ చట్టం, 1961, గృహహింస నుండి మహిళా రక్షణ చట్టం 2005, ఐపీసిసెక్షన్ 498(2), 509, తదితర అంశాల గురించి వివరిస్తూ మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వారి హక్కుల కోసం మహిళలు ధైర్యంగా నిలవాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని తెలిపారు.
ఈ సదస్సులో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పి. సూర్య ప్రభావతి, సి.డి.పి.ఓ. సిహెచ్.వి. నరసమ్మ, డి.సి.పి.ఓ. రాజ్ కుమార్, హరిత దళం ఎన్.జి.ఓ. సభ్యులు చిట్టి బాబు, వివిధ ఎన్.జి.వో. సంస్థల వారు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News