Breaking News

అనుమానిత‌, అసాధార‌ణ బ్యాంకు లావాదేవీల‌పై దృష్టిపెట్టాలి

– స‌మ‌న్వ‌యం, వేగంగా స‌మాచార మార్పిడితో మంచి ఫ‌లితాలు
– రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనుమానిత‌, అసాధార‌ణ బ్యాంకు లావాదేవీల‌పై ప్ర‌త్యేకంగా దృష్టికేంద్రీక‌రించాల‌ని.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో స‌మ‌న్వ‌యం, వేగంగా స‌మాచార మార్పిడితో మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌త్యేక వ్య‌య ప‌రిశీల‌కులు నీనా నిగ‌మ్ పేర్కొన్నారు.
గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌త్యేక వ్య‌య ప‌రిశీల‌కులు నీనా నిగ‌మ్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి సీపీ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌, జిల్లా వ్య‌య ప‌రిశీల‌కులు వి.జ‌స్టిన్‌, సౌర‌భ్ శ‌ర్మ‌, మ‌ద‌న్ కుమార్, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్ త‌దిత‌రులు హాజ‌రుకాగా తొలుత క‌లెక్ట‌ర్ డిల్లీరావు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. జిల్లాలో 17,04,077 మంది ఓటర్లు ఉన్నార‌ని వివ‌రించారు. మీడియా స‌ర్టిఫికేష‌న్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ ద్వారా రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లకు ప్రీస‌ర్టిఫెకేష‌న్ ఇవ్వ‌డం జ‌రుగుతోందని తెలిపారు. జిల్లాలో ఎల‌క్ష‌న్ సీజ‌ర్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ ప‌టిష్టంగా అమ‌లవుతోంద‌ని.. 2024, మార్చి 16 నుంచి మే 1 వ‌ర‌కు చూస్తే రూ. 3.38 కోట్ల న‌గ‌దు, రూ. 48 ల‌క్ష‌ల విలువై మ‌ద్యంతో పాటు మొత్తం రూ. 6.92 కోట్ల విలువైన సీజ‌ర్లు జ‌రిగిన‌ట్లు వివ‌రించారు. ఓట‌ర్ హెల్ప్‌లైన్‌, ఎన్‌జీఎస్‌పీ, కాల్‌సెంట‌ర్, సీ విజిల్ త‌దిత‌ర మార్గాల ద్వారా 2,216 ఫిర్యాదులు రాగా 2,196 ఫిర్యాదులను ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపారు. సోష‌ల్ మీడియా కార్య‌క‌లాపాలు, ఎన్‌కోర్‌/సువిధ అనుమ‌తులు త‌దిత‌రాల‌ను కూడా వివ‌రించారు. సీపీ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌.. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు 60 కేసులు బుక్ చేయ‌డం జ‌రిగింద‌ని.. 11 అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దు చెక్‌పోస్టులు, 8 అంత‌ర‌జిల్లా చెక్‌పోస్టులు స‌జావుగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయ‌ని తెలిపారు. అదే విధంగా నిఘా బృందాల ప‌నితీరు, క్రిటిక‌ల్ పోలింగ్ స్టేష‌న్లు, భ‌ద్ర‌తా ప్ర‌ణాళిక‌, ఈవీఎం గార్డింగ్, స్ట్రాంగ్ రూమ్స్ భ‌ద్ర‌త త‌దిత‌రాల‌ను సీపీ వివ‌రించారు. అనంత‌రం జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు, సీజ‌ర్ల‌కు సంబంధించిన కేసుల ప‌రిష్కారం, బ్యాంకు లావాదేవీలు, మ‌ద్యానికి సంబంధించిన ఉల్లంఘ‌న‌లు, ఫిర్యాదుల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ త‌దిత‌రాల‌పై ఆయా విభాగాల నోడ‌ల్ అధికారులు వివ‌రించారు.

ప్ర‌లోభాలు లేని వాతావ‌ర‌ణంలో..: రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌త్యేక వ్య‌య ప‌రిశీల‌కులు నీనా నిగ‌మ్
రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌త్యేక వ్య‌య ప‌రిశీల‌కులు నీనా నిగ‌మ్ మాట్లాడుతూ ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా అభ్య‌ర్థుల వ్య‌య ప‌రిశీల‌న ఇత‌ర అంశాల‌పై దృష్టిసారించాల‌ని పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ప్ర‌లోభాలు లేని వాతావ‌ర‌ణంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. అనుమానిత‌, అసాధార‌ణ లావాదేవీల స‌మాచారాన్ని క‌చ్చితంగా విశ్లేషించాల‌ని.. పోస్టల్ ఆర్డర్లు, యూపీఐ పేమెంట్ల‌పైనా ప్రత్యేకంగా దృష్టికేంద్రీక‌రించాల‌న్నారు. బ్యాంకులలో పెద్ద మొత్తంలో డిపాజిట్స్, నగదు ఉపసంహరణలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఎక్కడైనా అనుమానాస్పద కేసులు గమనిస్తే, వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లాల‌న్నారు. డ‌బ్బు, మ‌ద్యం త‌దిత‌రాల అక్ర‌మ ర‌వాణాను అడ్డుకునేందుకు వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులు బృంద స్ఫూర్తితో ప‌నిచేయాల‌ని ప్ర‌త్యేక వ్య‌య ప‌రిశీల‌కులు నీనా నిగ‌మ్ పేర్కొన్నారు. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కుల‌తో క‌లిసి సాధార‌ణ ఎన్నిక‌లు-2024పై పోలింగ్ అధికారుల‌కు సూచ‌న‌ల బుక్‌లెట్‌ను ఆవిష్క‌రించారు. స‌మావేశం అనంత‌రం రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌త్యేక వ్య‌య ప‌రిశీల‌కులు నీనా నిగ‌మ్.. క‌లెక్ట‌ర్ డిల్లీరావు, అధికారుల‌తో క‌లిసి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్‌రూం, ఎంసీఎంసీ, సోష‌ల్ మీడియా, సీజ‌ర్స్ రిడ్రెస‌ల్ విభాగాల కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు. స‌మావేశంలో డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, ఎంసీఎంసీ మెంబ‌ర్ డా. వెల‌గా జోషి, వివిధ విభాగాల నోడ‌ల్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *