– ఈ నెల 7, 8, 9 తేదీల్లో హోంఓటింగ్
– 23 వేల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు
– పీవోలు, ఏపీవోలకు 4, 6 తేదీల్లో శిక్షణ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ వినియోగం
– ఇతర అధికారులు, సిబ్బందికి ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఓటు వేసేందుకు అవకాశం
– హోం ఓటింగ్ ద్వారా 1,052 మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ విధులతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందితో పాటు హోం ఓటింగ్‌తో కలిపి మొత్తం 23 వేల మందికి పైగా ఓటర్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటేషన్ సెంటర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లిరావు పరిశీలించారు. అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్ పాల్, నరీందర్ సింగ్ బాలి
లతో కలసి రాజకీయ పార్టీల ప్రతినిధులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోలేక హోం ఓటింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హత ఉన్న 1,052 మంది ఓటర్లకు వారి ఇంటి వద్దనే ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 5 గంటలలోపు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఓటు హక్కు ఉండి సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ఈ నెల 2వ తేదీ ఉదయం వరకు అత్యవసర సేవలకు చెందిన 706 మందికి, 6,191 మంది పీవోలు, ఏపీవోలు, ఓపీవోలకు; 5,115 మంది సెక్టార్ అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, డ్రైవర్లకు, 231 మంది మైక్రో అబ్జర్వర్లకు, 1304 మంది పోలీస్ సిబ్బంది, 452 మంది ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఇతర యూనిఫాం సర్వీసెస్ లకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్న మరో 2,641 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు జిల్లాకు చెందిన 150 మంది, ఇతర జిల్లాలకు చెందిన 625 మంది పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న అధికారులు, సిబ్బందికి మరియు హోం ఓటింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 4, 6 తేదీల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు వారికి కేటాయించిన నియోజకవర్గంలో ఎన్నికల విధులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని.. శిక్షణ పొందే కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఎన్‌టీఆర్ జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాలకు సంబంధించిన పీవోలు, ఏపీవోలు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓపీవోలు, ఇతర ఎన్నికల సిబ్బంది అనగా పోలీస్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, వెబ్‌క్యాస్టింగ్, మైక్రోఅబ్జర్వర్లు తదితర సిబ్బంది వారికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ప్రత్యేక బృందాలు హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి గృహానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
Prajavartha Online Telugu News