తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మే 14 నుంచి 22 వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర కు సంబంధించి సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళిక బద్దంగా ఏర్పాట్ల ను చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర కు సంబంధించి సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళిక బద్దంగా ఏర్పాట్ల చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జీ ఓ నంబర్ 9 మేరకు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్యూ లైన్ నియంత్రణ, కంట్రోల్ రూం ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, మెడికల్ క్యాంపు లు ఏర్పాటు, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచడం, త్రాగు నీరు, విద్యుత్తు సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని, ఫైర్ సేఫ్టీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం తదితర అంశాలపై ప్రణాళికలు బద్దంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ముగింపు రోజులలో భక్తుల రద్దీ ని దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖుల పర్యటనల వలన దర్శన కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా తగినట్లు దర్శన సౌకర్యం కల్పించాలని తెలిపారు.
గంగమ్మ జాతర మహోత్సవములు వివరాలు
మే 14 మంగళవారం చాటింపు, 15 వ తేదీ బుధవారం బైరాగి వేషo, 16 వ తేది గురువారం బండ వేషo, 17 వ తేది శుక్రవారం తోటి వేషo, 18 వ తేది శనివారం దొర వేశo, 19 వ తేదీ ఆదివారం మాతంగి వేషం, 20 వ తేది సోమవారం సున్నపు కుండలు, 21 వ తేది మంగళవారం గంగమ్మ జాతర సప్పరం, మే22 వ తేది బుధవారం విశ్వరూప దర్శనం ఉంటుందని జాతర నాడు సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగినట్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి మునిసిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, దేవదాయ శాఖ మల్టీజోన్-2 రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ ఎన్ వి ఎస్ఎన్ మూర్తి, తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఈఓ మమత తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News