Breaking News

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకమైనది, విలువైనది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకమైనది, విలువైనదని గుర్తించి గ్రామస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ(దళిత వాడ) గ్రామస్తులు రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామన్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ అప్రమత్తమై జిల్లా పోలీస్ అధికారి అద్నాన్ నయీం అస్మితో కలిసి గురువారం ఉదయం ఆ గ్రామం సందర్శించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి గ్రామస్తుల విన్నపాలను ఎంతో ఓపిక ఆలకించారు. గ్రామస్తులు మోహన్ సర్వేశ్వరరావు పలువురు ఎస్సీ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ గ్రామంలో గత 50 సంవత్సరాలుగా పోలింగ్ కేంద్రం 208 ఉండేదని అయితే ఈసారి ఆ కేంద్రాన్ని పక్కన ఉన్న గౌడుపాల్యానికి మార్చారని, దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, తమ గ్రామంలోని పోలింగ్ కేంద్రమైన తుఫాను షెల్టరు శిధిలావస్థకు గురి కావడంతో అక్కడికి మార్చామని చెబుతున్నారని, వాస్తవానికి తమ గ్రామంలో కమ్యూనిటీ హాల్ భవనము ఉన్నదని అందులోనే గతంలో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరిగాయని అదేవిధంగా ప్రస్తుత సాధారణ ఎన్నికలు కూడా అక్కడే జరిపేలా పోలింగ్ కేంద్రం మార్పు చేయాలని లేదా తాత్కాలికంగా అయిన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రం మార్పు చేయడంలో తప్పులు చేసిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు

అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తుల భావనలతో తాను ఏకీభవిస్తున్నానని, వారు అడిగే విషయంలో న్యాయం ఉందని చెప్పారు. ఇదివరకు పోలింగ్ కేంద్రం మార్పు గురించి గ్రామస్తుల అభిప్రాయాన్ని సేకరించి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పోలింగ్ కేంద్రం మార్పు గురించి ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన సిఫారసు చేస్తూ ప్రతిపాదనలు పంపామన్నారు. వారు ఏ కారణం చేత ఒప్పుకోలేదో ఇంకా తెలియలేదని, ఇంకా పోలింగ్ కేంద్రం మార్పు విషయం ఆమోదించలేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరు అని వివరించారు.

ప్రస్తుత పరిస్థితులలో చేసేది ఏమీ లేదని, మార్పు చేయడానికి వీలు లేదని, తాత్కాలిక పోలింగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే గౌడు పాలెం పోలింగ్ కేంద్రానికి ఈవీఎంలు, పోలింగ్ సిబ్బంది అందరూ కేటాయింపు జరిగాయని వివరించారు. అవసరమైతే గ్రామస్తులు ఆర్టిఐ కింద దరఖాస్తు చేసుకొని జిల్లా ఎన్నికల యంత్రాంగం పంపిన వివరాలను కోరిన పక్షంలో వాటిని అందజేస్తామన్నారు. అంతేగాక చదువుకున్న వారు ఎవరైనా సరే ఇప్పుడే తన వద్దకు వస్తే ఉత్తర ప్రత్యుత్తరాల దస్త్రాన్ని కూడా చూపిస్తామని చెప్పారు.

అధికారిగా కాకుండా మీలో ఒకరిగా మీ వద్దకు వచ్చానని, ఓటు వేయడం మానకండి అని కోరారు. ఈ ఎన్నికల వరకు ప్రస్తుతం గౌడుపాలెంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో నిడమర్రు దళితవాడ గ్రామం 400 మంది ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క ఓటు చాలా విలువైనదని, వారి ఓట్లు ఈ నియోజకవర్గానికి, రాష్ట్రానికి, దేశానికి చాలా కీలకమన్నారు. వారికి ఏమైనా భయాందోళన గాని, ఒత్తిళ్లు గాని ఉంటే చెప్పాలని వారికి గట్టి పోలీసు రక్షణ కల్పించి, ధైర్యంగా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను చిన్నతనంలో
కర్ణాటక రాష్ట్రంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఉదహరించారు

గతంలో వీఆర్వో లేదా కిందిస్థాయి ఉద్యోగులు ఎవరైనా నివేదికలు పంపడంలో గాని, ఏదైనా లోపం గాని, తప్పుగాని చేసి ఉంటే విచారణ జరిపి బాధ్యులైన వారి పైన తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో గ్రామస్తులకు జరిగిన ఇబ్బందులకు మన్నించాలన్నారు. తన విన్నపాన్ని గౌరవించి గ్రామస్తులు తప్పనిసరిగా వారి ఓటు హక్కును గౌడు పాలెం పోలింగ్ కేంద్రంలో వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయకుండా ఎవరైనా అడ్డుకునే పక్షంలో ప్రశాంత వాతావరణంలో వారు ఓటు వేసేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యాక మరల నూటికి నూరు శాతం పోలింగ్ కేంద్రం మార్పు కోసం ప్రతిపాదనలు ఎన్నికల సంఘానికి పంపి ఫోన్ ద్వారా కూడా తెలియజేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. చూపిస్తామని చెప్పారు. గ్రామస్తులు మోహన్ జిల్లా కలెక్టర్ వద్దకు రాగా వారు అతనికి ఆ దస్త్రాన్ని చూపించారు. దీంతో అతను సంతృప్తి చెందారు.

జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ గ్రామస్తులు శాంతియుతంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని ప్రశాంత వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి ఆ గ్రామస్తులందరూ మాట్లాడుకుని ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో ఓటు తప్పకుండా వేస్తామని జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల కైనా తమకు తప్పనిసరిగా తమ గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఉండేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో పెడన రిటర్నింగ్ అధికారి పి వెంకటరమణ, డిఎస్పి రమేష్, పలువురు ఎస్సీ సంఘాల నాయకులు, నిడమర్రు దళితవాడ గ్రామస్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *