-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
-సూళ్ళూరుపేట నియోజకర్గంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి పోలింగ్ కొరకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్న కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
సూళ్ళూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
సూళ్ళూరుపేట నియోజకవర్గ పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి ఏర్పాట్లు బాగా ఉన్నాయని, సాయంత్రం లోపు పోలింగ్ పార్టీ వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చూడాలని రిటర్నింగ్ అధికారికి సూచిస్తూ, అర్హులైన ప్రతి ఓటరు రేపు మే 13న జరగబోవు పోలింగ్ కేంద్రం నందు ఓటు వేసి తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం సూళ్ళూరుపేట నియోజకర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 7 అసెంబ్లీ మరియు ఒక పార్లమెంట్ నియోజకవర్గాలకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి ఈ వి ఏం లను , పోలింగ్ సామాగ్రిని పోలింగ్ పార్టీ వారు తీసుకుని ఏర్పాటు చేసిన బస్సులలో సెక్టర్ అధికారులు, రూట్ మొబైల్ వారు కలిసి వారికి కేటాయించిన రూట్ ద్వారా సంబందిత పోలింగ్ కేంద్రాలకు భద్రత నడుమ పంపడం జరుగుతుందని అన్నారు. విధులు కేటాయించబడిన ప్రాంతoలో వీరు బసకు సంబందించిన ఏర్పాట్లు కూడా బి.ఎల్.ఓ.ల ద్వారా సెక్టార్ అధికారులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. వేసవి ఎండలు దృష్ట్యా పోలింగ్ కేంద్రాల యందు త్రాగునీరు, షేడ్ ఏర్పాటు, మెడికల్ క్యాంప్ లు, ప్రతి మండల కేంద్రం నందు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచడం జరిగిందని, పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని అన్నారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవిఎంలను నియోజకవర్గ కేంద్రాల స్ట్రాంగ్ రూమ్ నందు భధ్రపరచి అనంతరం 14న తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూమ్ నందు పొలిటికల్ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల సమక్ష్యంలో భధ్రపరచడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎపిక్ కార్డు తో పాటు ప్రభుత్వంచే గుర్తింపబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని రావాలని, దొంగ ఓట్లు వేయడానికి ఎవరైనా పాల్పడితే అలాంటివారిపై కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని, అన్ని చెక్ పోస్టుల యందు పర్యవేక్షణ ఉంటుందని, ఫిర్యాదులు అందితే వాటిపై సత్వర చర్యలు తీసుకుంటామని, అందరు ఓటర్లు రేపు జరగనున్న పోలింగ్ నందు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
Prajavartha Online Telugu News