Breaking News

టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి

-ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టించేలా తెలుగుదేశం కౌంటింగ్ ఏజంట్లను రెచ్చగొడుతున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు శనివారం వెలగపూడి సచివాలయం నందు డిప్యూటీ సీఈఓ విశ్వేశ్వరరావును కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని మల్లాది విష్ణు ఆరోపించారు. తెలుగుదేశం కౌంటింగ్ ఏజంట్లకు ట్రైనింగ్ క్యాంపులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. వైసీపీ కౌంటింగ్ ఏజంట్లను తరిమికొట్టాలని.. కౌంటింగ్ ప్రాంతంలో లేకుండా చేయాలని రెచ్చగొట్టేలా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల నియమావళిపై కనీస అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ అధినేతకు ఓటమి భయం పట్టుకుందని.. కనుకనే అల్లర్లు సృష్టించి ఈ ఎన్నికలలో గెలుపొందేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజాతీర్పును మార్చేందుకు ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎక్కడా దౌర్జన్యకాండ జరగకుండా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి.. కఠినంగా వ్యవహరించాలని ముందస్తుగా ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మల్లాది విష్ణు మండిపడ్డారు. సజ్జల మాటలను తెలుగుదేశం లీగల్ సెల్ పూర్తిగా వక్రీకకరించి.. ఆయనపై తప్పుడు కేసు బనాయించిందని నిప్పులు చెరిగారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదెవరో ఓటర్లకు బాగా తెలుసన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి సైకో అని, గొడ్డలి అని.. ఘర్షణలు సృష్టించేలా నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, కూటమి టీడీపీ నేతలపై నేటికీ కనీస చర్యలు లేవని మల్లాది విష్ణు అన్నారు. వైసీపీ ఇచ్చిన దాదాపు వందకిపైగా ఫిర్యాదులు ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా కోడ్ ను పదేపదే ఉల్లంఘిస్తున్న చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని కోరినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరించిందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *