మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణలో భాగంగా అభివృద్ధికి భూములను ఇచ్చిన రైతులు, భూ యజమానులకు చెల్లించవలసిన నష్టపరిహారంపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై ఎయిర్పోర్ట్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా తమ భూములను ఇచ్చిన దావాజీగూడెం, బుద్దవరం గ్రామ వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద చినఅవుటపల్లిలో ఐదు సెంట్ల స్థలంతో పాటు రూ.9 లక్షల నగదును ఇప్పటికే కొంతమందికి చెల్లించడం జరిగిందని, మిగిలిన వారందరికీ నష్టపరిహారం చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా వ్యవసాయ రైతులకు ప్రతి ఏటా చెల్లించవలసిన యాన్యుటి చెల్లింపునకు సైతం చర్యలు చేపట్టాలన్నారు. విమానాశ్రయ అభివృద్ధికి భూములు ఇచ్చిన ప్రైవేటు వెంచర్ల యజమానులకు అజ్జంపూడి గ్రామంలో భూమికి భూమి కేటాయింపు, లేఅవుట్ అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఏపీసిఆర్టిఏ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
విమానాశ్రయమునకు సమీపంలో గల ఏలూరు కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ఇప్పటివరకు నిర్మాణం చేపట్టకపోవడానికి గల కారణాలను తెలియజేయాలన్నారు. ఎయిర్పోర్టులోని పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు త్వరలో ఇతర అధికారులతో కలిసి గన్నవరంలో పర్యటిస్తామన్నారు.
ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎమ్ఎల్కే రెడ్డి, గుడివాడ ఆర్టీవో పి పద్మావతి, గన్నవరం తహసిల్దార్ ఎన్ఎస్ పవన్ కుమార్, కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ తేజేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News