విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమం (ఎన్ఎల్ఈపీ) కింద ఈ వ్యాధి నిర్ధారణపై అవగాహనకు (ఎల్సిడిసి) సంబంధించిన వర్క్‌షాప్ బుధవారం విజయవాడ ఆలివ్ ట్రీ హోటల్లో జరిగింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్. కె. పద్మావతి అధ్యక్షత వహించిన ఈ వర్క్‌షాప్‌నకు మొత్తం 26 జిల్లాల నుండి జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టిబి అధికారులు, డిఎన్ఎంఓలు/టిబి మెడికల్ ఆఫీసర్లు టిహెచ్ వార్డు మెడికల్ ఆఫీసర్లు హాజరయ్యారు. లెప్రసీ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ప్రచార కార్యక్రమం (ఎల్ సిడిసి) 18 జూలై 2024 నుండి 02 ఆగస్టు 2024 వరకు కొనసాగనున్న నేపథ్యంలో దీనికి సన్నాహకంగా, జిల్లాల్లో ఎన్‌ఎల్‌ఇపి కింద అధికారులకు శిక్షణ ఇవ్వడానికి ఈ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ ను నిర్వహించచారు. శిక్షణలో గుర్తింపు, రిపోర్టింగ్ ఫార్మాట్లు మరియు లెప్రసీ గురించి అధికారులు, ఇతర సిబ్బందికి అవగాహన పెంచడంపై నిపుణులు పలు సూచనలు చేశారు. గతేడాది నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఫేజ్-1, ఫేజ్-2 ఎల్సిడిసి నుండి తెలుసుకున్న అంశాలపై ఈ వర్క్ షాప్ లో డాక్టర్ పద్మావతి సమీక్షించారు. గతంలోని తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి ఈ సందర్భంగా ఆమె నొక్కి చెప్పారు. కుష్టు వ్యాధిని గుర్తించడం కోసం బృందాలు సర్వే చేసి, నిర్ధారణ కోసం ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరీక్షించేందుకు గాను ఇళ్లను సరిగ్గా గుర్తించాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. దీంతో పాటు కుష్టు వ్యాధి కేసుల నిర్ధారణ కోసం పాఠశాలలు , హాస్టళ్లలో విద్యార్థుల్ని పరీక్షించేందుకు కచ్చితమైన ప్రణాళిక అవసరమన్నారు. సమాజంలో కుష్టు వ్యాధిని సమర్థవంతంగా గుర్తించడానికి సరైన ప్రణాళిక, అమలు చాలా కీలకమని ఆమె స్పష్టం చేశారు. త్వరలో జరుగబోయే ఎల్సిడిసి ప్రచారం యొక్క సామర్థ్యాన్ని మరియు ప్రభావాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ ను నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
Prajavartha Online Telugu News