-గిరిజన ప్రాంత తెగలపై సికిల్ సెల్ ఎనీమియా ప్రభావం..
-గిరిజన జనాభాలో ప్రతి 86 మందిలో ఒకరికి సికిల్ సెల్ ఎనీమియా..
-గిరిజనులకు స్క్రీనింగ్ టెస్టులు.. ఇప్పటికే మొదటి దశ పరీక్షలు పూర్తి
-వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు.. ఉచితంగా చికిత్స, మందుల పంపిణీ..
-సికిల్ సెల్ ఎనీమియా తీవ్రంగా మారకుండా నిరోధించడం ఉత్తమం..
-కాంతిలాల్ దండే, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సికిల్ సెల్ (వ్యాధి) రక్తహీనత (ఎనీమియా) ను 2047 నాటికి నిర్మూలించడమే లక్ష్యంగా 2023లో కేంద్ర ప్రభుత్వం మిషన్ను ప్రకటించిందని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) లో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంతిలాల్ దండే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా సికిల్ సెల్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో 0-40 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న 7 కోట్ల మందికి అవగాహన కల్పించడం, నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించడమే సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ ప్రధాన ఉద్దేశమన్నారు. సికిల్ సెల్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ అవేర్నెస్ డేని పాటిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా గిరిజన తెగలలో సంభవించే సికెల్ సెల్ వ్యాధిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్లకి ఈ వ్యాధి వస్తుందన్నారు. దీనిని నిరోధించేందుకు గిరిజనులకు స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించామని, ఇప్పటికే మొదటి దశ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. తల్లిదండ్రులలో ఎవరైనా ఈ లోపభూయిష్ట జన్యువును పొందినపుడు సదరు వ్యక్తి వ్యాధి యొక్క వాహకంగా మారవచ్చని వివరించారు. సికిల్ సెల్ ఎనీమియాను సకాలంలో నిర్ధారించడం వల్ల, చికిత్సను వెంటనే ప్రారంభించడానికి సహాయపడుతుందన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి తీవ్రంగా మారకుండా నిరోధించడమే ఉత్తమమైన మార్గమని కాంతిలాల్ దండే స్పష్టం చేశారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జె. వెంకట మురళీ మాట్లాడుతూ.. సికిల్ సెల్ ఎనీమియా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోందన్నారు. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్లో భాగంగా రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో పలు కార్యకమాలు చేపడుతున్నామన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి వ్యాప్తిని పరీశిలించినట్లయితే ప్రతి 86 మంది ట్రైబల్ జనాభాలో ఒకరికి ఈ వ్యాధి వ్యాపిస్తోందన్నారు. ఇందులో భాగంగా 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మిషన్ ను చేపట్టిందన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 7 కోట్ల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేసి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారికి అవగాహన, వైద్యం, ఆర్థిక సహాయం చేసి వారందరూ మెరుగైన జీవితాన్ని పొందేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో 0-40 వయస్సుగల గిరిజనులందరికీ అంటే సుమారు 20 లక్షల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా 2023-2024 సం.లో 5,39,443 మందికి అంటే నూటికి నూరుశాతం స్క్రీనింగ్ చేశారన్నారు. ఈ ఏడాది 10,78,126 మందికి స్క్రీనింగ్ టెస్టులు చేయాల్సి ఉండగా ఇప్పటికే 1,78,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. అలాగే, వచ్చే సంవత్సరం 3,72,00 మందికి స్క్రీనింగ్ నిర్వహించాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,667 మందికి వ్యాధి నిర్ధారణ కాగా 18,668 మందిని వాహకాలుగా గుర్తించామన్నారు. మన రాష్ట్రంలో సికిలె సెల్ ఎనీమియా వ్యాధి నిర్ధారణ అయినవారికి రూ.10 వేల పెన్షన్ కూడా అందించడం జరుగుతోందన్నారు. ప్రతి ఏటా జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా డేగా పాటిస్తూ ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ఇప్పటివరకు 600 బస్సులపై ప్రకటనలు, 725 పిల్లర్ బోర్డులు, 1500 చైతన్య రథాలు, 9000 డిజిటల్ బోర్డులు, 20 లక్షల పాంప్లెట్స్, 4 లక్షల పోస్టర్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు.
అనంతరం సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన మిషన్ పై రూపొందించిన పోస్టర్లు, పాంప్లెట్స్ ను గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. కాంతిలాల్ దండే ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు, మెడికల్, పారా మెడికల్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News