-గంజాయి, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికడతాం
-ఏపీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజ్ఞప్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అసాంఘిక శక్తులు పాల్పడుతున్న దుశ్చర్యలకు కారణం అవుతున్న గంజాయి, మత్తు పదార్థాల వినియోగాన్ని, అమ్మకాలను నియంత్రించాలంటే విడివిడిగా ఉన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ( సెబ్ ), ఎక్సైజ్ శాఖ లను విలీనం చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్ లోని ఎన్జీవో హోం లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ‘సెబ్’ విభాగాన్ని ఎక్సైజ్ శాఖలోని సిబ్బందితో ఏర్పాటు చేసిందన్నారు. ఈ విభాగం ప్రభుత్వంలోని కొందరు పెద్దల అదుపాజ్ఞలలో పని చేసిందన్నారు.రాష్ట్రంలో మద్యం మరియూ ఇసుక విధానాలను సక్రమంగా నిర్వహించేందుకే గత ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశామని చెప్పుకొన్నప్పటికీ అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు తమ స్వప్రయోజనాల కోసం, తమ రహస్య అజెండాను సజావుగా అమలు పరచేందుకే సెబ్ అనే బూచిని ఏర్పాటు చేశారనే విమర్శ ఉందన్నారు. మద్యం, ఇసుక విధానాల్లో మార్పులు, చేర్పులు చేసి క్రమంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను క్రియారహితం చేసినట్లు పలు ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. కొన్ని చట్టాలపై సెబ్ కి రిజిస్ట్రేషన్ అధికారాలు కట్టబెట్టకుండా, క్రమంగా బడ్జెట్ కేటాయింపులు తగ్గించివేశారన్నారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసిందనేది జగమెరిగిన సత్యమని,
ఈ శాఖలో పనిచేస్తున్న అధికారులకు అసాంఘిక శక్తులపై ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం లేకుండా కోరలు లేని పాములా ఈ శాఖ పని చేసిందన్నారు. గత ప్రభుత్వ పాలనా కాలంలో గంజాయి నియంత్రణ కోసం వాస్తవానికి గంజాయి సాగు చేసే వారిపై దాడులు చేసి, పంటను నాశనం చేయాల్సి ఉండగా ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల భవిష్యత్ తరం పౌరులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. మన రాష్ట్రంలో తయారైన నాణ్యతలేని మద్యం అమ్మకాల పెంపుదల కోసం మాత్రమే సెబ్ అనే విభాగం పని చేసిందన్నారు. జేఏసీ చైర్మన్ బాబ్జిరావు మాట్లాడుతూ ఎక్సైజ్, సెబ్ విభాగాలను విలీనం చేయాల్సిన అవసరాన్ని తాము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి లోకేష్ లకు ఇప్పటికే వివరించామన్నారు. వారు కూడా ఆయా శాఖల అధికారులతో సమీక్షించి రెండు విభాగాలను కలిపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.గతంలో ఎక్సైజ్ శాఖగా కలసి ఉన్నప్పుడు ప్రతీ ఎక్సైజు స్టేషనులోనూ అధికారులు, సిబ్బంది సంఖ్య 10 నుంచి 15 మంది వరకూ ఉండేవారన్నారు. వారు 3 లేదా 4 మండలాల పరిథిలో అన్ని ఆబ్కారీ మరియు డ్రగ్స్ నేరాలను నియంత్రిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేలా సమర్థవంతంగా పనిచేసేవారని వివరించారు. ఎక్సైజు శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగుల సేవలను సంపూర్ణంగా వినియోగించుకొనేవారు. ఎక్సైజ్ శాఖను రెండుగా విభజించడం వల్ల గతంలో సమిష్టిగా చేసిన పని విభజించబడింది. కానీ పనిభారం పెరిగింది. పనిచేయాల్సిన పరిథి పెరిగింది. ప్రధానంగా దీని వల్ల ఎక్సైజ్, సెబ్ రెండు విభాగాల్లోనూ సిబ్బంది కొరత ఏర్పడింది. రెండు విభాగాల వల్ల నిర్వహణా వ్యయం పెరిగిందన్నారు. ఎక్సైజ్, సెబ్ ల మద్య విభజన సహేతుకంగా జరగకపోవడం వల్ల పదోన్నతులు, బదిలీలు వంటి సర్వీసు అంశాల్లో సమస్యలు పెరిగాయన్నారు. దీనివల్ల న్యాయస్థానాల్లో అనవసరమైన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయని వివరించారు.
ఎక్సైజ్ విభాగం హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ సహాధ్యక్షులు మార్పు కోటయ్య మాట్లాడుతూ 2019 ముందు రాష్ట్రంలో గంజాయి వినియోగం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ప్రభుత్వ పెద్దలు గమనించి, రెండు విభాగాలను వీలైనంత త్వరలో ఒకే శాఖగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు.సెబ్ అనే విభాగం లోని అధికారులకు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఇటీవల గత ప్రభుత్వ మద్యం విధానంపై విడుదల చేసిన శ్వేత పత్రం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సిఐడి విభాగం అధికారులు విచారిస్తున్న వాసుదేవ రెడ్డి ఇస్తున్న సమాచారం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎక్సైజ్ లో పరిమితంగా ఉన్న సిబ్బందితో, 4380 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 888 బార్ అండ్ రెస్టారెంట్లు , 4148 కల్లు సొసైటీలు, 28 డిస్టిలరీలు, 29 ఐ.ఎం.ఎల్. డిపోలు, 752 ఫైగా ఉన్న ఆర్.ఎస్., డి. ఎస్. ఉపయోగించే పరిశ్రమలు, హాస్పిటల్స్ పర్యవేక్షణ మరియూ అక్రమాల కట్టడి కష్టసాధ్యం అవుతోందన్నారు.
రెండు విభాగాలు ఒకే విభాగంగా మార్పు చేస్తే రాష్ట్రంలో గంజాయి వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎంతో బలం చేకూరుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News