Breaking News

జిపిఎస్ పై గెజిట్ ఉత్తర్వుల నిలుపుదల హర్షణీయం

-దురదృష్టకర రోజులుపోయాయి…
-రానున్నవి ఉద్యోగులకు మంచి రోజులే…
-గత ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలపై శ్వేత పత్రం విడుదల చేయండి…
-ఏపీ ఎన్జీవో నేతలు కె.వి. శివారెడ్డి, Ch. పురుషోత్తం నాయుడు, A. విద్యా సాగర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం ఉద్యోగుల అభీష్టానికి వ్యతిరేకంగా సి పి ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిరంకుశంగా అమలు చేయాలని ప్రయత్నించిన గ్యారెంటీ పెన్షన్ స్కీం (జి.పి.ఎస్.) గాజెట్ ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించడం రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జరిగే మంచి కార్యక్రమాలకు శుభ పరిణామమని గతప్రభుత్వం ఉద్యోగులకు యిచ్చిన మోసపూరిత వాగ్దానాలు చెల్లించాల్సిన బకాయిలు పై శ్వేత పత్రం విడుదల చేయాలని కె.వి. శివారెడ్డి అన్నారు. గాంధీ నగర్ లోని ఎన్జీవో హోం లో మంగళవారం రాష్ట్ర సంఘ ప్రధానకార్యదర్శి సిహెచ్. పురుషోత్తమనాయుడు జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తో కలసి శివారెడ్డి పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తొలి మాసంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు నిర్ణీత వ్యవధిలో ఒకటో తేదీన జీతాలను జమ చేయడం పట్ల ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వేతనాలతో పాటు రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల పాత బకాయిల విషయంలో కూడా సానుకూలంగా ఉద్యోగులకు మేలు చేస్తుందని నమ్ముతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్యోగులందరూ తమ శక్తి మేరకు విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను రౌడీలు గూండాలు కంటే హీనంగా చూసిందన్నారు.అందుకే తగినమూల్యం చెల్లించు కోవాల్సివచ్చిందన్నారు . ఉద్యోగులు తమ హక్కుల కోసం నిరసన తెలిపిన క్రమంలో 1500 మందికి పైగా ఉద్యోగులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తి వేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కి శివా రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, ఆశా వర్కర్లు, అంగన్వాడి వంటి విభాగాల కార్మికులకు తమకంటే ముందుగానే జీతాల జమ చేయాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ కు విజ్ఞప్తి చేయగా ఈ విషయంలో సానుకూలంగా స్పందించారన్నారు. తక్కువ వేతనంతో బాధ్యతలు నిర్వహిస్తున్న వీరికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రభుత్వ ఉద్యోగులుగా తమ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన బకాయిలు చెల్లించేందుకు కొంత సమయం తీసుకున్నప్పటికీ, అత్యవసరమైన వైద్య సేవల విషయంలో మాత్రం ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగులకు అందించే వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కోరారు.

ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ నూతనంగా కొలువైన ప్రభుత్వం గత ప్రభుత్వంలో వివిధ విభాగాలలో జరిగిన అక్రమాలపై శ్వేత పత్రం విడుదల చేస్తున్న విధంగానే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన సొమ్ములను గత ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేసిందో కూడా వివరించేలా శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. 25 వేల కోట్లకు పైగా డి ఏ, పి ఆర్ సి బకాయిలు, GPF, APGLI, సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయని, వాటి వివరాలు అన్నిటిని ప్రభుత్వం ఒక వాస్తవిక పత్రం ద్వారా తెలియజేయాలని కోరారు. హెల్త్ కార్డులకు మేము కట్టిన డబ్బులు హాస్పిటల్ కి చెల్లించలేదని, అలాగే సిపిఎస్ ఉద్యోగులు జీవితంలో నుంచి రికవరీ చేసిన సొమ్ములు ప్రాన్ అకౌంట్ కి ఎంత కట్టారో ఎంత కట్టలేదో లెక్క కూడా తేలాలని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులతో పాటు, చాలా సందర్భాలలో గత ప్రభుత్వం ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయటం అక్రమ కేసులు బనాయించడం వంటి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారీంచాలని కోరారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొనని ఉద్యోగులపై కూడా గత ప్రభుత్వం అక్రమ కేసులను బనాయించడం ఉద్యోగ సంఘాలుగా ఎన్నోసార్లు తమ ఆవేదనను తెలియజేసినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజులన్నీ ఉద్యోగులకు శుభకరమైన రోజులేనని భావిస్తున్నామన్నారు.

విజయవాడ ఎన్జీవో హోం లో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎన్జీవో సంఘ రాష్ట్ర నాయకులు రంగారావు, కృష్ణారెడ్డి, రంజిత్ నాయుడు, క్యాపిటల్ సిటీ కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల రాష్ట్ర నాయకుడు రామకృష్ణ, పశ్చిమ కృష్ణా కార్యవర్గసభ్యులు డి ఎస్ ఎన్ రెడ్డి , పి.రమేష్. బి. సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *