Breaking News

తెలంగాణ తరహాగా మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్‌ పెంచాలి

-సీఎం చంద్రబాబుకు ఏపీ ఫార్మర్‌ లెజిస్లేటర్స్‌ ఫోరమ్‌ విజ్ఞప్తి
-ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఫ్రోటోకాల్‌ కల్పించాలని విన్నపం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరహాగా ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ ఎంఎల్‌సిలకు, మాజీ ఎంఎల్‌ఎలకు పెన్షన్‌ పెంపునకు చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఏపీ ఫార్మర్‌ లెజిస్లేటర్స్‌ ఫోరమ్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వెలగపూడిలోని సీఎంవో కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబును ఫోరమ్‌ గౌరవాధ్యక్షులు దివి శివరామ్‌ (మాజీ ఎమ్మెల్యే), ప్రెసిడెంట్‌ ఎంవీ శివారెడ్డి(మాజీ ఎమ్మెల్సీ), వైఎస్‌ ప్రెసిడెంట్‌ జల్లి విల్సన్‌(మాజీ ఎమ్మెల్సీ), కార్యదర్శి పసల కనక సుందరరావు(మాజీ ఎమ్మెల్యే), రుద్రరాజు పద్మరాజు (మాజీ ఎమ్మెల్సీ) కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజుకు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు, రాష్ట్ర శాసన వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు, బీజేపీపక్ష నేత విష్ణుకుమార్‌రాజ్‌కు వినుతులు ఇచ్చారు. వైసీపీ, జనసేన శాసనసభ పక్ష కార్యాలయాలకు ఫోరమ్‌ నేతలు వెళ్లి ఆయా పార్టీ ప్రతినిధులకు వినతిపత్రాలను అందజేశారు. తొలుత చంద్రబాబును ఏపీ ఫార్మర్‌ లెజిస్టేచర్స్‌ ఫోరమ్‌ నేతలు కలిసి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి అఖండ మెజార్టీతో ఎన్నికైనందుకుగాను శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు ఏళ్లతరబడి ప్రజా జీవితంలో మమేకమై సేవలు చేశారని, నేటికీ చేస్తున్నారని వివరించారు. వారి వయసుమీరడంతో వృద్ధాప్యంలో అనేక శారీరక రుగ్మతలతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వారిలో ఎక్కువమంది బడుగు, బలహీనవర్గాలకు చెందిన పేదవారే వున్నారని తెలిపారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ..ఫోరమ్‌ విజ్ఞప్తులను పెద్దమనస్సుతో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అధిక ధరలు, కుటుంబ భారాలు, అవసరాలు పెరిగిపోయిన దృష్ట్యా మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నెలకు ఇస్తున్న పెన్షన్‌ రూ.30 వేలు సరిపోవడం లేదన్నారు. గత 10 సంవత్సరాల నుంచి పెన్షన్‌ పెరుగుదల లేదని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకిచ్చే పెన్షన్‌ను పరిగణనలోకి తీసుకుని…మన రాష్ట్రంలోని మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులకు పెన్షన్‌ను నెలకు రూ.50 వేలకు పెంచి ఇప్పించేందుకు సానుకూలంగా పరిశీలించి అమలుపర్చాలని కోరారు. ఈ మేరకు పెన్షన్‌కు చెందిన తెలంగాణ ప్రభుత్వ గెజిట్‌ను ఆ వినతితోపాటు జత చేసినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులను రాష్ట్ర సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీకిగానీ, జిల్లా కేంద్ర ఆసుపత్రికిగానీ వచ్చి తీసుకోవడం చాలా ఖర్చుతో, శ్రమతో కూడి కష్టతరమవుతోందని తెలిపారు. కొంతమంది మంచంలోనే బతుకు ఈడ్చుతున్నారని, గత 6,7 నెలలుగా మందుల సరఫరా కూడా లేదని, చాలా ఇబ్బందులకు గురయ్యారని వివరించారు. వయోభారం, శారీరక, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంవారు సరఫరా చేసే మందులను మీరు ఎంపిక చేసిన మాకు అందుబాటులో కలిగిన బ్రాండెడ్‌ మెడికల్‌ షాపుల నుంచి గాని, కొరియర్‌ ద్వారా గాని అందజేసి ఆదుకోవాలని కోరారు. సదరు సభ్యులకు సరైన నివాసంలేక ఇబ్బందులు పడుతున్నారని, మన రాజధాని అమరావతి ప్రాంతంలో 500 చదరపు గజములు విస్తీర్ణం కలిగిన ఇళ్లస్థలాలను నామమాత్రపు ధరకు ఇచ్చి అన్ని మౌలిక సౌకర్యములు గల నివాస సౌకర్యం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

మన దేశ రాజధాని న్యూదిల్లీలోని ఏపీ గెస్ట్‌ హౌస్‌లో నామమాత్రపు ధరతో క్లాస్‌3తో వసతి సౌకర్యం కల్పించాలని కోరారు. అక్కడ ప్రస్తుతం చాలా అధిక ధరలు వసూలు చేస్తున్నారని, వాటిని సవరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఫోరం కార్యక్రమాలు నిర్వహణకు ప్రభుత్వాధినేతలు, అధికారులను కలుసుకునేందుకు మన అసెంబ్లీ ప్రాంగణంలో గదిని ప్రత్యేకంగా కేటాయించి, నిర్వహణకు తగిన సిబ్బందిని కేటాయించాలని విన్నవించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మాజీ ప్రజాప్రతినిధులకు తగిన ప్రోటోకాల్‌ సౌకర్యం, గౌరవం కల్పించాలని కోరారు. మాజీ ప్రజాప్రతినిధులు ప్రయాణించే వాహనాలకు టోల్‌ ఫ్రీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలతో సహా గ్రేడ్‌-1 దేవస్థానాలలో దైవదర్శనం, వసతి సౌకర్యం కల్పించి మాజీ కుటుంబాలను ఆనందపారవశ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుని వృద్ధులైపోయిన మాజీ ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబాలను ఆదుకుని ఉపశమనం కలిగించాలని ఫోరమ్‌ తరఫున కోరారు. ఎల్లవేళలా ప్రజాప్రతినిధులు, వారి బంధుగణం కృతజ్ఞతతో ఉంటామని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *