Breaking News

కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వచ్ఛమైన పాలన అందించి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలబెడదామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో తొలుత మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులకు అభినందనలు, జడ్పిటిసి, ఎంపీపీ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు. ఎన్నో ఆశలతో ఎన్నో బాధల నుండి బయట పడాలని ప్రజలు 95% మాండేట్ ఇచ్చి గురుతర బాధ్యత మాపై ఉంచారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 కు 16 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిందని, బందరు పోర్టు పనులు వేగంగా పరిగెత్తించాలని, బిపిసిఎల్ కంపెనీ మన ప్రాంతంలో 60 నుండి 70 వేల కోట్ల పెట్టుబడులతో రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సంక్షేమ పాలన అందించాలని, అందుకు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు సహకరించాలని, జిల్లాను నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి సంయుక్తంగా కృషి చేద్దామన్నారు.

సభను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో రోడ్లు తాగునీరు సమస్యలు పరిష్కరిస్తూ 15వ ఆర్థిక సంఘం నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మహిళల స్వావలంబన కోసం కుట్టు మిషన్లు వంటి వాటిని అందించి వారి జీవనోపాధికి తోడ్పాటు ఇస్తున్నట్లు తెలిపారు నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు, సమన్వయంతో జిల్లా అభివృద్ధి పథంలో నడుపుటకు కృషి చేస్తామన్నారు.

జిల్లాలో నూతనంగా ఎన్నికైన అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, గుడివాడ, పెడన శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్ సభలో మాట్లాడుతూ వారి వారి నియోజకవర్గాల్లో సమస్యలు ప్రస్తావించి పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, రహదారులు తదితర అజెండా అంశాలపై సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులచే సమాధానాలు ఇప్పించి, సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి, జడ్పీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఆయా మండలాల్లో తాగునీటి సమస్యలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై పరిష్కార చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీటి కులాయి అందించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో గ్రామాల్లో ఫాగింగ్ చేయడం నీటి నిల్వ కుంటల్లో డ్రైన్లలో ఆయిల్ బాల్స్ చల్లాలని తద్వారా దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.

పాఠశాల భవనాలు లేని చోట్ల మంజూరు చేయాలని, పాఠశాలల్లో టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని ఆట స్థలం సమస్యలు ఉంటే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.

వ్యవసాయ, ఇరిగేషన్ అంశాల్లో జరిగిన చర్చలో జిల్లాలో కాలువలు, మురుగు కాలువల్లో గుర్రపు డెక్క, తూడు తొలగింపు పనులు ఇంతవరకు చేపట్టకపోవడంవల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ప్రస్తావించగా, వచ్చే ఏడాది నుంచి ముందుగానే కాలువల నిర్వహణ పనులు, మురుగు కాలువలలో సిల్టు తొలగింపు పనులు చేపట్టేలా చూస్తామని మంత్రి, జిల్లా కలెక్టర్ అన్నారు.

ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లు పేదలకు కేటాయించేలా ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కావడం లేదని సభ్యులు ప్రస్తావించగా, ఫీజు రెగ్యులేషన్ కమిటీలను యాక్టివేట్ చేయాలని, ప్రభుత్వ పథకాలు గురించి ప్రజాప్రతినిధులకు ముందుగా తెలియజేయాలని జడ్పీ చైర్ పర్సన్ అధికారులను ఆదేశించారు.

జడ్పీటీసీలు వచ్చే ఆగస్టు 15 తేదీన జెడ్పి పాఠశాలల్లో జాతీయ జెండా ఎగరవేయడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరగా రాష్ట్రస్థాయిలో ఈ అంశంపై చర్చిస్తామని మంత్రి అన్నారు.

తొలుత భారత మాజీ రాష్ట్రపతి అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్, శాసనసభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

జడ్పీ సీఈవో ఆనంద కుమార్ తొలుత సభకు స్వాగతం పలికి అజెండా అంశాలు వివరించారు.

ఈ సమావేశంలో కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల జడ్పిటిసిలు, ఎంపీపీలు, 3 జిల్లాల వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *