-బాధిత కుటుంబాలకు రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి!!!
-ఆగస్టు 2న క్వారీల్లో ప్రమాదాలు,పరిశ్రమల కాలుష్యంపై
-ఇబ్రహీంపట్నంలో ధర్నా
-సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమలు, క్వారీలలో భద్రతను పర్యవేక్షించాల్సిన గనులు, పరిశ్రమలు, కార్మిక, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూళ్ళ మత్తులో జోగటంతోనే ప్రభ్యుత్వాల ఉదాసీనత వల్ల కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పరిటాలలోని ఉన్న పవన్ గ్రానైట్ అండ్ మెటల్ వర్క్స్ చెందిన క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా సిపిఐ జిల్లా బృందం శనివారం ఆ క్వారీని సందర్శించింది. ఎలాంటి భద్రత లేని క్వారీలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నిశితంగా పరిశీలించింది. అనంతరం దోనేపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల పరిశ్రమలలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్, రాంకో సిమెంట్, ఎన్.టి.పి.సి, పరిటాల క్వారీ ప్రాంతాలలో జరిగిన ప్రమాదాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన కార్మికులు అసువులు బాయటంపై ఆవేదన వ్యక్తం చేశారు. తండాలకు చెందిన అతి నిరుపేదలు పొట్ట కూటికోసం పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చిన వారు ప్రాణాలు పణంగా పెట్టి క్వారీలలో పనిచేస్తున్నారని చెప్పారు. ఎండనక, వాననక, బండరాళ్ళు దుమ్ము ధూళి మధ్యలో కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్న కార్మికుల శ్రమను పెత్తందారులు దోచుకుంటుంన్నారని విమర్శించారు. కనీస రక్షణ కవచాలైన గ్లౌజులు, హెల్మెట్లు, బూట్లు కూడ ఇవ్వకుండా ప్రమాదకరమైన పనిని చేయిస్తున్నారని అన్నారు. నాసిరకమైన జెలిటన్ స్టిక్స్ ఇచ్చి కొండను పగుల గొట్టిస్తున్న సందర్భంలో కొన్నిసార్లు కార్మికుల ప్రాణాలు బండరాళ్ళ మధ్య తెల్లారిపోతున్నాయని పేర్కొన్నారు. ఇన్సురెన్స్, ఇ.ఎస్.ఐ వంటి కార్మిక చట్టాలను కూడా అమలు చేయడంలేదని మండిపడ్డారు. 300 ఎకరాల విస్తీర్ణంలో వున్న క్వారీలపై వేలాదిమంది ఆధారపడి వున్నారని చెప్పారు. ప్రభుత్వం 99 క్వారీలకు అనుమతి ఇచ్చిందని అదనంగా మరో 50 క్వారీలు అనధికారికంగా నడుస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందని ధ్వజమెత్తారు. అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతూ పరిశ్రమల పర్యవేక్షణను గాలికి వదిలి వేసారని విమర్శించారు. అక్రమ తవ్వకాలు రక్షణ చర్యలు తీసుకోకపావడంతో క్వారీలు సమాధులుగా మారుతున్నాయని అన్నారు. కమీషనర్ ఆఫ్ ఎంప్లాయీస్ కాంపెన్‌సేషన్ యాక్ట్ నిర్దేశించినట్లు ఈ క్వారీలో చనిపోయిన కార్మికుల వయసు మేరకు 35 ఏళ్ళ రాందేవ్ భాగేల్ కుటుంబానికి రూ.16,89,150/` ఇవ్వాలని కార్మికశాఖ అసిస్టెంట్ కమీషనర్ ఆదేశించి వారాలు దాటుతున్న బాధితులకు ఇంకా పరిహారం అందలేదన్నారు. ప్రభుత్వం మానవీయ కోనంలో ఆలోచించి మృతులు వి.వి.నాయక్, బత్తుల దుర్గారాజు, రాందేవ్ బాగేల్ కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి నారాలోకేష్, ప్రతిపక్ష పార్టీ నాయకుడు వై.ఎస్.జగన్మోహాన్‌రెడ్డి ఇంతవరకు పరామర్శించలేదని అన్నారు. ఇప్పటికైనా ఈ నాయకులు బాధితులను పరామర్శించి భరోసా కల్పించాలని కోరారు. ప్రమాదాలు జరుగుతున్న కంపెనీలపై విచారణ చేపట్టి ప్రభుత్వ నిబంధనలు తుంగలో తోక్కి కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆగస్టు 2తేదీన క్వారీల్లో ప్రమాదాలు,పరిశ్రమల కాలుష్యంపై ఇబ్రహీంపట్నం సెంటర్‌లో ధర్నాకు పిలుపు నిచ్చారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ పర్యటనలో శంకర్‌తో పాటు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్, కార్యదర్శి వర్గసభ్యులు చుండూరు సబ్బారావు, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, సిపిఐ జిల్లా కార్య వర్గసభ్యులు మల్నీడు యలమందరావు, బుట్టి రాయప్ప, లంకా గోవింద రాజులు, ఎన్టీఆర్ జిల్లా సమితి సభ్యులు తాడి పైడియ్య, కొట్టు రమణారావు, కౌలు రైతుసంఘం నాయకులు పెయ్యల వెంకటేశ్వరరావు, రైతుసంఘం నాయకులు సాంబశివరావు, కన్నా వెంకట్రావు, మన్నె హనుమంతరావు, ఎస్.కె.సుభానీ, యువజన నాయకులు ఎస్.లాల్ మోహన్, గాడి అజయ్, సింగంశెట్టి మోహన్‌ప్రసాద్, రామకృష్ణ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News