అవనిగడ్డ/మోపిదేవి/ఘంటసాల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి “మీకోసం” నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. అవనిగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సోమవారం “మీకోసం” కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ముఖ్య కేంద్రంలో ప్రతి సోమవారం మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నామని, అయితే జిల్లాలో పలు ప్రాంతాల నుండి మచిలీపట్నం వచ్చి ప్రజలు అర్జీలు ఇవ్వడానికి పడుతున్న ఇబ్బందులు గమనించి జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ప్రతి సోమవారం ఒక్కొక్క నియోజకవర్గంలో అందుబాటులో ఉండి, మీకోసం నిర్వహించి అర్జీలు స్వీకరించడానికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు అవనిగడ్డలో మీకోసం నిర్వహించి అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన అర్జీలు పరిశీలించి సత్వరమే పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం కలెక్టర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు ఈరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, రవ్వ కేసరి, చిక్కి, ఉడికించిన గుడ్డుతో కర్రీ పిల్లలకు వడ్డించగా, కలెక్టర్ విద్యార్థులతో కలిసి క్రింద కూర్చుని స్వయంగా ఆహార పదార్థాలను రుచి చూశారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అయితే కొంతమంది విద్యార్థులు ఇంటి వద్ద నుండి తమ భోజనం తెచ్చుకుని తినడం చూసి, కారణాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు ముచ్చటించి వారి భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారని అడిగి తెలుసుకుని, వారితో కలిసి ఫోటో దిగి వారిలో స్ఫూర్తిని నింపారు.
ఇదే పాఠశాలలో కిచెన్ గార్డెన్స్ పరిశీలించారు. తోటకూర విత్తనాలు చల్లగా మొలకెత్తిన తోటకూర మొక్కలు పరిశీలించారు.
మోపిదేవి లో అంగన్వాడి కేంద్రం తనిఖీ
అనంతరం జిల్లా కలెక్టర్ మోపిదేవిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గల అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, చిన్నారుల హాజరు పట్టి పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పాలు పోషకాహారం వివరాలు తెలుసుకుని వాటి స్టాకు రిజిస్టరు పరిశీలించారు చిన్నారుల శారీరక ఎదుగుదల పరిరక్షణకై వారి ఎత్తు, బరువు పరిశీలించి నమోదు చేసే రిజిస్టర్లు కూడా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్నారుల ఎత్తు బరువు సరి చూసి కచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. అదేవిధంగా వారి ఆరోగ్య సంరక్షణకు తగిన వైద్య పరీక్షలు చేయడంతో పాటు నిర్ణీత సమయంలో వ్యాక్సినేషన్ జరిపించి రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు.
ఘంటసాల మండలంలో డ్రైనేజీల పరిశీలన
అనంతరం కలెక్టర్ ఘంటసాల మండలం లక్ష్మీపురం వద్ద, మాజేరు వద్ద గుండేరు మేజర్ డ్రైన్ పరిశీలించారు. డ్రైనేజీలలో గుర్రపుడెక్క తూడు తొలగింపు పనులు ఎంతవరకు వచ్చాయో ఆరా తీశారు. గుండేరు మేజర్ డ్రైన్ అందులో కలిసే మైనర్ డ్రైన్ లలో గుర్రపుడెక్క, తూడు తొలగింపునకు ప్రభుత్వం రు.75 లక్షలు మంజూరు చేసిందని, పనులు పక్కాగా నిర్వహించాలని, పంట పొలాలు మునగకుండా రైతులకు సంపూర్ణంగా మేలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
అనంతరం జీలగలగండి వద్ద అయినంపూడి డ్రేయిన్ పరిశీలించారు. అందులో కిక్కిస ఎక్కువగా వ్యాపించి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నదని, దీని నిర్వహణకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు అధికారులు తెలుపగా, నిధులు మంజూరుకు ఉన్నతాధికారులతో మాట్లాడతామని కలెక్టర్ అన్నారు. ఇరిగేషన్ డియి రవికిరణ్, డ్రైనేజీ డిఈ పి. వెంకటేశ్వరరావు కలెక్టర్ తో ఉన్నారు.
మీకోసం కార్యక్రమంలో అవనిగడ్డ తాసిల్దార్ నాగమల్లేశ్వరరావు, అవనిగడ్డ సిహెచ్సి సూపర్డెంట్ డాక్టర్ జయ కుమార్, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News