మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ను కట్టుదిట్టంగా భద్రపరచాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్లో గల జిల్లా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ గోదాముకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉందా లేదా గమనించారు. అలాగే గోదాములో పార్లమెంటు నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంలను వేరువేరుగా ఉంచిన షట్టర్ల తాళాలను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరచి లోపల ఉన్న బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదాములో ఈవీఎంలను చాలా జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. నిరంతరం గట్టి పోలీస్ బందోబస్తు ఉండాలన్నారు. సరిగా పనిచేయని 10 బ్యాలెట్ యూనిట్లను, 9 కంట్రోల్ యూనిట్లను, 33 వివి ప్యాట్లను మరమ్మతు నిమిత్తం బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కంపెనీకి పంపించాలని కలెక్టర్ ఎన్నికల విభాగం అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట మార్కెటింగ్ ఏడి నిత్యానందం, తెలుగుదేశం, సిపిఎం, బిజెపి, బి ఎస్ పి పార్టీల ప్రతినిధులు బత్తిన దాసు, కొడాలి శర్మ,పంతం గజేంద్ర రావు, సౌదాడ బాలాజీ, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిటి శ్యాము సాంకేతిక నిపుణురాలు సుధా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News