విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మహా కుంభమేళా 2025ని మార్చే యోచనలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య తెలిపారు. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సారథ్యంలో విజయవాడలో శనివారం భారీ రోడ్డు షో జరిగింది. అనంతరం ఈ సందర్భంగా నగరంలోని ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రయాగ్‌రాజ్ (పశ్చిమ) ఎమ్మెల్యే సిద్దార్ధనాథ్ సింగ్‌తో కలిసి మాట్లాడుతూ… భిన్నత్వంలో ఏకత్వానికి మహాకుంభ్ నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు గంగా, యమున, సరస్వతీ నదుల సంగమమైన ప్రయాగరాజ్ ఒడ్డున నిర్వహించే ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళా-2025లో పాల్గొనాల్సిందిగా ఏపీ ప్రజలను ఆయన కోరారు. కుంభమేళా ప్రాంతంలో టీటీడీ స్టాల్స్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యం, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ కార్యక్రమం చారిత్రాత్మకంగా నిలిచిపోయేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహాకుంభ్ భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్-సంవేశి భారత్ (ఏకభారతదేశం, గొప్పభారతదేశం, సమ్మిళిత భారతదేశం)ను స్పృశించే దైవిక, శక్తివంత రూపమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో యూపీలోని డబుల్ ఇంజన్ భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మార్చడానికి అంకితభావంతో ఉందని ఆయన అన్నారు. పవిత్రమైన ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళకు రావాల్సిందిగా ఆయన ఆహ్వానం పలుకుతూ కొన్ని లక్షల మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అతిథులకు బస ఏర్పాట్లు, రవాణా సౌకర్యం, అక్కడి ప్రాంతం యొక్క చరిత్రను తెలుసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Prajavartha Online Telugu News