-కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ సహాయ శాఖ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ వెల్లడి
-పర్ డ్రాప్-మోర్ క్రాప్ పథకం పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక (AAP) ద్వారా అమలవుతున్న పర్ డ్రాప్-మోర్ క్రాప్ (PDMC) పథకం కింద 2015-16 నుంచి 2023-24 వరకు మొత్తం 9.30 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని మైక్రో ఇరిగేషన్ కింద కవర్ చేయగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికలో 1.24 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని మైక్రో ఇరిగేషన్ కింద కవర్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ సహాయ శాఖ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ తెలిపారు.
పెర్ డ్రాప్ మోర్ క్రాప్ (PDMC) పథకం కింద డ్రిప్ , స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్స్ కోసం ఏమైనా నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్ణయించారా? నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మైక్రో ఇరిగేషన్ కవరేజీపై అహ్మదాబాద్‌లోని IIM అధ్యయన ఫలితాలపై ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం వుంది?కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా రైతులకు ఎన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారంటూ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ (PDMC) పథకానికి సంబంధించి పలు ప్రశ్నలను కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖను మంగళవారం లోక్ సభలో ఎంపి కేశినేని శివనాథ్ అడగటం జరిగింది. వీటికి ఆ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థల వినియోగంపై రైతులకు కృషి విజ్ఞాన్ కేంద్రం (KVKs) 816 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక మైక్రో ఇరిగేషన్ వ్యవసాయం పై అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) చేసిన పరిశోధనలు నీటి పొదుపుతోపాటు పంటల దిగుబడి గణనీయంగా పెరుగుతుందని తెలిపాయన్నారు.
Prajavartha Online Telugu News